సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్‌

29 May, 2019 13:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీవీ 9 చానల్‌ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే, ఆయన ఇంతవరకు  పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రవిప్రకాశ్‌ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగం, బంజారాహిల్స్‌ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు.

>
మరిన్ని వార్తలు