ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45

3 Mar, 2020 03:05 IST|Sakshi
సీబీఎస్‌ఈ పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు పూలు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు

భారీ భద్రత మధ్య సీబీఎస్‌ఈ పరీక్షలు

వదంతులు వ్యాప్తి చేస్తున్న 40 మంది అరెస్టు

అంకిత్‌ శర్మ కుటుంబానికి డిల్లీ ప్రభుత్వం కోటి సాయం

న్యూఢిల్లీ: వారం క్రితం అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. అల్లర్ల కారణంగా వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను సోమవారం పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. 98 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.   

అంకిత్‌శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం
అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామన్నారు.

అల్లర్లపై రేపు సుప్రీం విచారణ
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పిటిషన్లపై 4న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ నాయకులు, ఇతరుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీనిపై పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘అల్లర్ల కారణంగా ప్రజలు చనిపోతుంటే వాయిదా ఎలా వేయగలరు ?’ అంటూ పిటిషన్‌దారుల తరఫున లాయర్‌ కోలిన్‌ గొంజాల్వెజ్‌ సుప్రీంకోర్టును అడిగారు. అయితే అల్లర్లను నియంత్రించడం తమ పని కాదని, దానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. బుధవారం విచారణ జరుపుతామని తెలిపింది.

మరిన్ని వార్తలు