కార్తీక పౌర్ణమి వేడుకలో తొక్కిసలాట: ముగ్గురు మృతి

4 Nov, 2017 10:40 IST|Sakshi

పాట్న : కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో సిమారియా ఘాట్ వద్ద చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పది మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలిసింది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రెండు మృతదేహాలను నదిలోకి విసిరినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు.. ఆలయాలకు తండోపతండాలుగా ఈ ఘాట్‌కు తరలి వచ్చారు. భక్తులు పెరిగిన కొద్ది సేపట్లోనే ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 2014లో కూడా పాట్నలో ఇదే రకమైన ఘటన చోటు చేసుకుంది. దసరా సందర్భంగా గాంధీ మైదాన్‌లో జరిగిన ఈవెంట్‌లో అప్పట్లో తొక్కిసలాట జరిగింది.

మరిన్ని వార్తలు