ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టుల హ‌తం

10 Jul, 2020 12:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప‌ట్నా : బిహార్‌లోని ప‌శ్చిమ చంపార‌న్ జిల్లా బ‌గ‌హా ప్రాంతంలో శుక్ర‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో అక్క‌డికి చేరుకున్న భ‌ద్ర‌తా బ‌లగాలు అట‌వీ ప్రాంతంలో గాలింపు చర్య‌లు చేప‌ట్టాయి. బిహార్ పోలీసులతో పాటు శస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సంయుక్తంగా ఈ సెర్చ్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వివ‌రించారు. ఎస్‌టిఎఫ్ బృందానికి పోలీసు సూప‌రింటెండెంట్ ధ‌రేంద్ర నాయ‌క‌త్వం వ‌హించార‌ని పేర్కొన్నారు. అయితే ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం ఉండ‌టంతో కొంద‌రు మావోయిస్టులు త‌ప్పించుకున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. (వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

ఈ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు అక్క‌డికక్క‌డే చ‌నిపోగా, ఓ పోలీసు అధికారికి తీవ్ర‌గాయాల‌పాలైన‌ట్లు స‌మాచారం. వెంట‌నే ఆయ‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు వివ‌రించారు. మావోయిస్టుల నుంచి అధునాత‌న ఆయుధాలు, ఏకె-56, ఎస్ఎల్ఆర్  స‌హా మూడు రెఫిల్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఐజీ సుంజ‌య్ కుమార్ తెలిపారు. సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని చెప్పిన ఐజీ.. చ‌నిపోయిన మావోయిస్టుల పేర్ల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. (గ్యాంగస్‌స్టర్‌ మరణంతో గ్రామంలో సం‍బరాలు)

మరిన్ని వార్తలు