సంజయ్ దత్ ఇంకో నాలుగు రోజులు..

19 Feb, 2015 13:02 IST|Sakshi

ముంబై :  బాలీవుడ్ హీరో సంజయ్ దత్  మరో నాలుగు రోజుల పాటు జైల్లో గడపాల్సి ఉంది.  అక్రమ ఆయుధాల కేసు,  ముంబై  పేలుళ్ల కేసులో సంజు భాయ్ ప్రస్తుతం పుణే జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ తన శిక్షా కాలంలో అదనంగా మరో నాలుగు రోజులు పాటు జైల్లోనే ఉండాలని మహారాష్ట్ర  హోంమంత్రి రామ్ షిండే  తెలిపారు.

సంజయ్ దత్ గత డిసెంబర్  24వ తేదీన 14 రోజుల ఫర్లాగ్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, అందువల్ల తన ఫర్లాగ్‌ను పొడిగించాలని సంజయ్‌దత్ జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.  ఈ నేపథ్యంలో జైలు అధికారులు, పోలీసులకు మధ్య సమన్వయ లోపం కారణంగా కొంత గందరగోళం నెలకొంది. అయితే  ఈ విషయంలో నిర్ణయం తేలకపోవడంతో,  జనవరి 8వ లొంగిపోవడానికి జైలుకొచ్చిన  సల్లూభాయ్ నాలుగు రోజులు పాటు జైలు బయటే ఉండిపోయాడు.
 
మరోవైపు సంజయ్‌కు చికిత్స అందించేందుకు ఫర్లాగ్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని పోలీసులు భావించినందున దరఖాస్తును తిరస్కరించామని జైలు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంజయ్ తిరిగి జనవరి 11వ తేదీన  అధికారుల ఎదుట లొంగిపోయాడు.  ఈ గందరగోళానికి  రాష్ట్ర  హోం మంత్రి రామ్ షిండే వివరణ ఇచ్చారు.  సంజయ్ దత్  ఫర్లాంగ్ గడువు, జనవరి 8వ తేదీతోనే ముగిసిందని స్పష్టం చేశారు.  

అయితే  నిబంధనలకు విరుద్ధంగా నాలుగు రోజులు జైలు బయట గడిపిన  ఆ నాలుగు రోజులు సంజయ్  శిక్షాకాలానికి అదనంగా కలుపుతామని షిండే  తెలిపారు.  నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన సంబంధిత అధికారులపై  శాఖాపరమైన విచారణకు ఆదేశించి, చర్యలు  తీసుకుంటామని తెలిపారు. జైలు మాన్యువల్ నుంచి  స్పష్టత  వచ్చిన అనంతరం  తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై  ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు