కొంపముంచిన లాక్‌డౌన్‌ 4.0..!

31 May, 2020 18:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటితో పోలిస్తే రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. మందులేని మహమ్మారికి లాక్‌డౌన్‌ మాత్రమే మంత్రమని భావించిన ప్రభుత్వం.. తొలిరోజుల్లో కఠినమైన ఆంక్షలను విధించింది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రాకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆంక్షలను సడలిస్తోంది. మార్చి 25న ప్రారంభమైన తొలివిడత లాక్‌డౌన్‌ మే 31 నాటికి నాలుగో విడతను సైతం పూర్తి చేసుకుని జూన్‌ 1 నుంచి ఐదో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టబోతుంది. అయితే దేశంలో తొలి విడత లాక్‌డౌన్‌లో 10,877 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నాలుగో విడత‌లో వైరస్‌ మరింత విజృంభించడంతో ఏకంగా 85,974 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. (కేసీఆర్‌ కీలక నిర్ణయం : నిషేధం ఎత్తివేత)

కాగా మే 31 నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,82,143 చేరింది. అంటే దాదాపు 50 శాతం పాజిటివ్‌ కేసులు కేవలం నాలుగో విడత లాక్‌డౌన్‌లోనే నమోదు కావడం గమనార్హం. మే 18 నుంచి 31 వరకు (ఆదివారం) వరకు కొనసాగిన లాక్‌డౌన్‌ 4.0 లో వైరస్‌ మరింత వ్యాప్తి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. వలస కార్మికుల తరలింపు, విదేశాల నుంచి భారతీయులను స్వస్థలాలకు చేర్చడం, శ్రామిక్‌ రైళ్ల ఏర్పాటుతో నాలుగో విడత లాక్‌డౌన్‌ వైరస్‌ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. (‘నమస్తే ట్రంప్‌’తోనే వైరస్‌ వ్యాప్తి..!)

ఇక మూడో విడత లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు ఆర్థిక కార్యక్రమాలకు కేంద్ర వెసులుబాటు కల్పించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. తొలి విడత లాక్‌డౌన్‌లో 10,877 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. ఏప్రిల్‌ 15 నుంచి మే 3 వరకు కొనసాగిన రెండో  విడత లాక్‌డౌన్‌లో 31,094 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక మే 3 నుంచి 17 వరకు అంటే 14 రోజుల పాటు సాగిన మూడో విడత లాక్‌డౌన్‌ కాలంలో 53,636 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిల్లో సగభాగం మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోనే నమోదు కావడం గమనార్హం. ఇక తాజాగా లాక్‌డౌన్‌ 5.0 ను ప్రకటిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇది జూన్‌ 30 వరకు కొనసాగనుంది.

మరిన్ని వార్తలు