రాఫెల్‌ జెట్ల కుంభకోణం.. రిలయన్స్ పాత్ర‌..!

16 Nov, 2017 09:21 IST|Sakshi

న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన(ఐఏఎఫ్‌) కోసం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ జెట్ల వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను ఫ్రాన్స్‌ ఖండించింది. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్‌ అనే సంస్థ రాఫెల్‌ జెట్లను తయారు చేస్తుంది. భారత్‌కు చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ డస్సాల్ట్‌తో భాగస్వామిగా ఉంది. 

కాంగ్రెస్‌ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ ఆరోపణలను వెనక్కు తీసుకోపోతే పార్టీని న్యాయపరంగా చర్యలకు వెళ్తామని హెచ్చరించింది. రిలయన్స్‌ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడటం వెనుక పెద్ద కారణమే ఉంది. రిలయన్స్‌ కంపెనీ యజమాని అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేలా రాఫెల్‌ జెట్ల కొనుగోలు ధరను ఎన్డీయే ప్రభుత్వం అమాంతం పెంచేసిందన్నదే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ఆరోపణ.

2015లో తన ఫ్రాన్స్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అప్పటి ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ హోలెండ్‌తో చర్చించి రూ. 58 వేల కోట్లకు 36 రాఫెల్‌ జెట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి 2012లోనే రాఫెల్‌ జెట్లను కొనుగోలు(ఇప్పటి ధరతో పోల్చితే తక్కువకు) చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చర్చలు జరిపింది. చర్చల్లో ఉండగానే.. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ డీల్‌ మరుగునపడింది.

దీంతో రాఫెల్‌ జెట్ల అవసరాన్ని వాయుసేన చీఫ్‌ పలుమార్లు ప్రధానితో చర్చించి వివరించారు. పాజిటివ్‌గా స్పందించిన ప్రధాని 2015లో డీల్‌ను కుదుర్చుకున్నారు. 2016 జూన్‌లో భారత ప్రభుత్వం రక్షణ రంగంలో 49 శాతం ప్రైవేటు పెట్టుబడులను(ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతుల అవసరం లేకుండా) అనుమతించింది.

మేక్‌ ఇండియాలో భాగంగా భారత్‌కు ఫ్రాన్స్‌ అందజేసే రాఫెల్‌ జెట్లలో కొన్నింటిని భారత్‌లోనే అసెంబుల్‌ చేసి అందించాలి. దీంతో డస్సాల్ట్‌ కంపెనీలో రూ. 30 వేల కోట్ల భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ తీసుకుంది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వం కావాలనే డస్సాల్ట్‌లో భాగస్వామిగా రిలయన్స్‌కు అవకాశం ఇచ్చిందని, జెట్ల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

కాంగ్రెస్‌ ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని ఫ్రాన్స్‌ పేర్కొంది. పారదర్శక పద్దతి ద్వారా మాత్రమే రిలయన్స్‌ డస్సాల్ట్‌లో భాగస్వామి అయిందని చెప్పింది. 2012 ధరలకు, 2016 ధరలకు మార్పులు ఉండవా? అని రిలయన్స్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించింది. భారత్‌లో జెట్లను అసెంబుల్‌ చేయడం వల్ల ధర మరింత పెరుగుతుందని తెలిపింది. ఆరోపణలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపరంగా చర్యలకు ఉపక్రమిస్తామని కాంగ్రెస​ పార్టీకి హెచ్చరికలు పంపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా