ప్రకృతి ప్రకోపానికి 116 మంది బలి

5 May, 2018 01:48 IST|Sakshi
ఆగ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ప్రకృతి ప్రకోపానికి యూపీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 116 మంది మృతిచెందగా, 300 మందికి పైగా గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీలకు రాష్ట్రాలకు వర్షం, పెనుగాలుల ముప్పు ఉందని శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇసుక తుపాన్, గాలి వాన, పిడుగుపాటులకు గురువారం ఉత్తరప్రదేశ్‌లో 73 మంది మరణించగా, 91 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభావిత రాష్ట్రాల్లో సుమారు 12 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా, 2,500 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

మరోవైపు, యూపీలో ప్రకృతి బీభత్సం ఎక్కువగా ఉండడంతో.. కర్ణాటక ఎన్నికల ప్రచారం వాయిదావేసుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హుటాహుటిన లక్నో చేరుకున్నారు. యోగి వేరే రాష్ట్రంలో ప్రచారం చేయడంపై విమర్శలు పెరిగాయి. ‘యూపీ ప్రజలు యోగిని ఎన్నుకున్నది తమ రాష్ట్రంలో పనిచేయమనే.. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం కాదు’ అని మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా యోగిపై విమర్శలు చేశారు.  
 

మరిన్ని వార్తలు