సిటీ పోలీసులకు ‘లోకల్‌’ ఉచితం 

17 May, 2018 07:00 IST|Sakshi

సాక్షి, ముంబై : డ్యూటీలో ఉన్న ముంబై (సిటీ) పోలీసులకు లోకల్‌ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లభించనుంది. అందుకు ఈ నెలాఖరు వరకు ముంబై పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అయితే ఈ ఒప్పందం కేవలం ఒక సంవత్సరం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తరువాత పొడగించాలా..? వద్దా...? అనేది నిర్ణయం తీసుకుంటారు. 

ఆర్పీఎఫ్‌కు సాయం చేస్తారని.. 
గతేడాది ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్‌–పరేల్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగిన తరువాత కేంద్ర రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులకు లోకల్‌ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించాలనే విషయంపై ముంబై పోలీసు కమిషనర్, గోయల్‌ మధ్య చర్చ జరిగింది. ‘‘కొద్ది కాలంగా లోకల్‌ రైళ్లలో నేరాల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైల్వే పోలీసులు,        ఆర్పీఎఫ్‌ బలగాలకు తోడుగా ముంబై పోలీసుల సహకారం ఉంటే అధిక శాతం నేరాలు అదుపులోకి వస్తాయి. అందుకు ముంబై పోలీసులకు లోకల్‌ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తే వారు డ్యూటీకి వచ్చేటప్పుడు, డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లేటప్పుడు లోకల్‌ రైళ్లలో ప్రయాణిస్తారు. దీంతో అత్యవసర సమయంలో వీరి సాయం వెంటనే లభిస్తుంది. అంతేగాకుండా ప్లాట్‌ఫారాలపై, రైళ్లలో చోరీచేసే చిల్లర దొంగలకు, నేరస్తులకు కొంత భయం పట్టుకుంటుంది. ఫలితంగా నేరాలు కొంతమేర అదుపులోకి వస్తాయి’’ అని ముంబై కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. 

యూనిఫార్మ్‌ కచ్చితం.. 
కమిషనర్‌ ప్రతిపాదనకు గోయల్‌ అప్పట్లో ప్రాథమికంగా అంగీకరించడంతో ప్రతిపాదన రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆ మేరకు ముంబై పోలీసులకు ఏ బోగీలో ప్రయాణించేందుకు అనుమతివ్వాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే సివిల్‌ డ్రెస్‌లో కాకుడా ఒంటిపై యూనిఫార్మ్‌ కచ్చితంగా ఉండాలనేది ప్రధాన షరతు. అప్పుడే చిల్లర దొంగలు, నేరస్తులు భయపడతారు. ప్రస్తుతం సెంట్రల్, పశ్చిమ మార్గంలోని అన్ని లోకల్‌ రైళ్లలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళా బోగీలలో రైల్వే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక ముంబై పోలీసులు కూడా రాకపోకలు సాగిస్తే శాంతి, భద్రతలు కొంత అదుపులో ఉంటాయని ముంబై పోలీస్‌ కమిషనర్‌ భావిస్తున్నారు. ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దిన తరువాత ప్రత్యక్షంగా అమలులోకి వస్తుందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు