మహిళలకు మెట్రో, బస్సు ప్రయాణాలు ఉచితం

3 Jun, 2019 07:40 IST|Sakshi

ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. ఈ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్న విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆప్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించింది.  

కాగా అంతకు ముందు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లోట్‌ ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ అధికారులను కలిసి వారితో చర్చించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు. అలాగే కొత్త ప్రతిపాదన వల్ల మెట్రో ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియజేయాలని కోరారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజూ దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల ఆదాయంపై ఎంత మేరకు ప్రభావం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని, మహిళా ప్రయాణికులు ఎంత మందో తెలుసుకోవడానికి కొత్తగా సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో ప్రజలు మెట్రోలో కన్నా బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో నిత్యం దాదాపు 42 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే బస్సుల్లో ప్రయాణించే మహిళల వాటా 20 శాతం కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. 

మరిన్ని వార్తలు