ఇప్పుడు ఫ్రీ అంటే.. తర్వాత ఇబ్బందులొస్తాయి

6 Sep, 2019 15:32 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన పథకం మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాల వల్ల ఢిల్లీ మెట్రో తీసుకున్న దీర్ఘకాలిక రుణాల చెల్లింపులపై భారం పడుతుందని స్పష్టం చేసింది. అంతేకాక, భవిష్యత్తులో మెట్రో విస్తరణ, సదుపాయాలు, సేవలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ఆప్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పథకం వల్ల ఇప్పటివరకు రూ. 100 కోట్ల నష్టంలో ఉన్న సంస్థపై రూ.1500 కోట్ల భారం పడుతుందని హెచ్చరించింది. ఏడాదికి ఏడు వేల కోట్ల ఆదాయం గడిస్తున్నా కూడా నష్టాలు తప్పట్లేదన్నారు. ప్రజాధనాన్ని సరిగ్గా ఉపయోగించాలనీ, ఉచిత పథకాలతో వృథా చేయవద్దని హితవు పలికింది.  (చదవండి: నిరుద్యోగ మహిళలకు కేజ్రివాల్‌ వరం)

మరిన్ని వార్తలు