మరో రైలుకు నిప్పు..

22 Feb, 2016 14:37 IST|Sakshi
మరో రైలుకు నిప్పు..

హర్యానా : హర్యానాలో జాట్ వర్గీయుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది.  బివాని, హిస్సర్ సహా , రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో పరిస్థితికి అదుపులోకి వస్తున్న తరుణంలో జాట్ కులస్తులు  రోహతక్ జిల్లాలో మరోసారి   పోరాటానికి దిగారు.    ఢిల్లీ- హర్యానా హైవేపై  పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులు సోమవారం రాస్తారోకో చేశారు. 

ఓ స్కూలు బస్సుపై కూర్చుని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం  కల్పిస్తూ నినాదాలతో హోరెత్తించారు. విద్యా ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

కాగా మునక్ కెనాల్ నీరు ఢిల్లీ చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అధికారులు ఇలా ప్రకటించారో లేదో అలా  ఆందోళనలు మళ్లీ  మిన్నంటాయి. ఢిల్లీ- బహదుర్గా రహదారి దిగ్బంధించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కల్పించారు. అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం వాహనానికి నిప్పుపెట్టారు.  సోనిపట్ లో గూడ్స్ రైలుకు నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. కాగా తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాట్ వర్గీయులు చేస్తున్న  ఆందోళన  హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ  ఘటనల్లో 12మంది మృతి చెందగా, వందలాదిమంది గాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు