మాంసం ఏమైనా కొత్తగా తింటున్నామా?

12 Apr, 2017 10:56 IST|Sakshi
మాంసం ఏమైనా కొత్తగా తింటున్నామా?
చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు మాత్రమే ధర్మం, నిజమైన మార్గం, పవిత్రమైనది లేదా అపవిత్రమైనది అనే దాని గురించిన ఆలోచిస్తారని మత్స్యేంద్రనాథ్‌( ఉత్తర భారతదేశంలో నాథ్‌ ఫౌండేషన్‌ను స్ధాపించిన గోరక్‌నాథ్‌ గురువు) ఆయన రాసిన అకుల్‌వీర్‌ తంత్ర గ్రంథంలో పేర్కొన్నారు. మరి మత్స్యేంద్రనాథ్‌ను అనుసరించే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బహుశా ఈ విషయం తెలుసో లేదో!. ధర్మం పేరిట సృష్టించుకున్న కొన్ని నిబంధనలను సడలించుకోవాలని గురు మత్స్యేంద్రనాథ్‌ ఆ కాలంలో పిలుపునిచ్చారు.
 
కౌలోపనిషత్తులో ఈ విషయాన్ని మరింత విపులంగా వివరించారు. నిజమైన స్వీయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉపవాసం ఉండడని, సమాజంలో ఒక వర్గాన్ని స్ధాపించడని, ఎలాంటి నిబంధనలు పెట్టుకోడని, అతని దృష్టిలో మనుషులందరూ ఒకటేనని కౌలోపనిషత్తు వివరించింది. కానీ ప్రస్తుత పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి విషయం త్వరగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అందులోకి తాజాగా శాకాహారం వచ్చి చేరింది. శాకాహారిగా ఉండటం భారత సంప్రదాయమని చెబుతూ.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాంసాహారంపై నిషేధం విధించారు.
 
మాంసాహారం చరిత్ర
వాస్తవానికి మాంసాహారాన్ని తీసుకునే అలవాటు రామాయణ కాలం నుంచి ఉంది. సింధు లోయ నాగరికత కాలంలో భారతీయులు ఎద్దు, దున్న, గొర్రె, మేక, తాబేలు, ఉడుం, చేపల మాంసాన్ని రోజూ వారీ ఆహారంగా వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఏర్పాటు చేసుకున్న మార్కెట్లలో మాంస క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. 250 రకాల జంతువుల్లో 50 రకాల జీవులను చంపి వాటి మాంసాన్ని తినొచ్చని వేదాల్లో రాసి ఉంది. గుర్రం, గేదే, మేకల మాంసాన్ని తినొచ్చని బుగ్వేదంలో ఉంది. ఇందులోని 162వ శ్లోకంలో చక్రవర్తులు గుర్రాలను ఎలా వధించేవారో వివరంగా ఉంది. 
 
ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన జంతువును బలి ఇచ్చేవారు. అగ్నికి ఎద్దు, ఆవులను, రుద్రుడికి ఎరుపు వర్ణం గల గోవులను, విష్ణువుకి మరగుజ్జు ఎద్దును, ఇంద్రుడికి తలపై మచ్చ కలిగిన ఎద్దును, పుషణ్‌కి నల్ల ఆవును బలి ఇచ్చేవారు. అగస్య మహాముని ఒకేసారి వంద ఎద్దులను బలి ఇచ్చిన సంఘటనను తైత్రేయ ఉపనిషత్తు ప్రశంసలతో ముంచెత్తింది. కొంతమంది బ్రహ్మణులు బంధువులు వచ్చిన సమయంలో కచ్చితంగా ఆహారంలో మాంసం ఉండేలా ఏర్పాట్లు చేసుకునేవారు. 
 
బృహాదారణ్యక ఉపనిషత్తులో మాంసాన్ని బియ్యంతో కలిపి వండే వారని ఉంది. దండకారణ్యంలో వనవాసానికెగిన రాముడు, సీత, లక్ష్మణులతో అలాంటి ఆహారాన్ని తీసుకున్నారని కూడా ఇందులో ప్రస్తావించారు. దీన్ని మాంసం భుత్తాదన అనేవారు. అయోధ్య రాజు దశరథుడు మటన్‌, పోర్క్‌, చికెన్‌, నెమలి మాంసంతో కూరలు వండే సమయంలో వాటిలో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించేవారు. మహాభారతంలో కూడా మాంసానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఉడికించిన అన్నంతో కలిపి మాంసాన్ని తీసుకునేవారని, కొన్ని రకాల పక్షులను కాల్చి తినేవారని, గేదె మాంసంపై నెయ్యి వేసుకుని తినేవారని ఉంది.
 
                                                                                                                   - ఓ సామాజిక వాది వ్యాసం
మరిన్ని వార్తలు