రేపటి నుంచే సభా సమరం!

22 Feb, 2015 02:31 IST|Sakshi


 సాక్షి, న్యూఢిల్లీ: సభా సమరానికి తెరలేవనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డినెన్స్‌లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తమైంది. మొత్తమ్మీద తాజాగా వెలుగుచూసిన కార్పొరేట్ గూఢచర్యంతోపాటు భూసేకరణ ఆర్డినెన్స్‌లతో ఉభయసభలు దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 23 నుంచి మార్చి 20 వరకు, ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతలో 26 రోజులు, రెండో విడతలో 19 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం 44 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది. సోమవారం తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ సర్కారు ఈనెల 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే, 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించాలని ప్రభుత్వం తలపోస్తోంది. వాటి స్థానంలో బిల్లులు తీసుకురానుంది. ఉభయ సభల్లో కొత్తగా ఏడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 3, రాజ్యసభలో పెండిం గ్‌లో ఉన్న 7 బిల్లులకు ఆమోదముద్ర  వేయిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచేందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ తీసుకురానుంది. లోక్‌సభలో ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు ఉన్నా.. రాజ్యసభలో విపక్షాలదే పైచేయిగా ఉండడంతో బిల్లుల ఆమోదంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.
 నేడు అఖిలపక్షంతో వెంకయ్య సమావేశం
 సభలో చర్చించాల్సిన బిల్లులపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లపై పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు సహకరించాల్సిందిగా విపక్షాలను కోరనుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా మధ్యాహ్నం వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ఆమె కోరనున్నారు.
 వ్యూహంపై కాంగ్రెస్ కసరత్తు
 బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఆంటోని, గులాం నబీఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ జ్యోతిరాదిత్యసింథియా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు