ఆ ఆరుగురి పాపమే !

21 Mar, 2020 01:39 IST|Sakshi

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 16, 2012.. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో ఢిల్లీ మెడికో విద్యార్థిని నిర్భయపై జరిగిన దారుణం అత్యంత హేయమైనది. నిర్భయపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెని, ఆమె స్నేహితుడ్ని ఐరన్‌ రాడ్‌లతో రక్తాలు కారేలా చితకబాది కదులుతున్న బస్సులోంచే బయటపడేసిన అకృత్యమది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనతో యావత్‌ జాతి కదలిపోయింది. నిర్భయ దోషులకు తగిన శాస్తి జరిగే వరకు పోరాడతామని ఎలుగెత్తి చాటింది. నిర్భయ తల్లిదండ్రులు, రేపిస్టులపై జాతి యావత్తు చేసిన పోరాటం నలుగురి ఉరితీతతో ముగిసింది. ఈ నేరం చేసిన ఆరుగురి వివరాలేంటో చూద్దాం

రామ్‌సింగ్, ప్రధాన నిందితుడు : నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన బస్సు డ్రైవరే రామ్‌ సింగ్‌. దక్షిణ ఢిల్లీలో రవిదాస్‌ కేంప్‌ మురికివాడల్లో నివాసం ఉండే అతనే ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులు రామ్‌సింగ్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. రామ్‌సింగ్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అతని సోదరుడు ముఖేష్‌ సింగ్‌ సహా మిగిలిన అయిదుగురిని అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగానే రామ్‌ సింగ్‌ 2013, మార్చి 10న జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబితే, అతనిని హత్య చేశారంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు.  

మైనర్‌: అత్యంత హేయమైన ఈ నేరంలో ఒక మైనర్‌ ప్రమేయం కూడా ఉంది. నిర్భయను క్రూరంగా హింసించింది ఈ మైనరే. అతనిని ఆనంద్‌విహార్‌ ప్రాంతంలో మర్నాడు ఉదయం నిర్బంధించిన పోలీసులు జువైనల్‌ కోర్టులో హాజరు పరిచారు. నేర నిర్ధారణ కావడంతో మూడేళ్లు రిమాండ్‌ హోమ్‌కి తరలించారు. మైనర్‌ అయినందున అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. మూడేళ్ల నిర్బంధం తర్వాత 2015 డిసెంబర్‌లో అతనిని విడుదల చేశారు.  

ఉరిశిక్ష అమలు చేసింది ఈ నలుగురికే
ముఖేష్‌ సింగ్, బస్సు క్లీనర్‌
తీహార్‌ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్‌ రామ్‌ సింగ్‌ తమ్ముడే ముఖేష్‌ సింగ్‌ (32). దక్షిణ ఢిల్లీలోని మురికివాడల్లో సోదరుడితో కలిసి నివసించేవాడు. అత్యాచారం జరిగిన రాత్రి నిర్భయను, ఆమె స్నేహితుడిని ఐరన్‌ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలున్నాయి. నేరం జరిగాక ముఖేష్‌ సింగ్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు అతనిని రాజస్తాన్‌లోని కరోలిలో అదుపులోనికి తీసుకున్నారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు ఆమె ప్రతిఘటించలేదని బీబీసీ ఇండియా డాటర్‌ అనే డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

పవన్‌ గుప్తా, పండ్ల వ్యాపారి
పవన్‌ గుప్తా (25) పండ్ల వ్యాపారి. అతను కూడా రవిదాస్‌ మురికివాడల్లోనే నివాసం ఉంటాడు. డిసెంబర్‌ 16 మధ్యాహ్నం తప్పతాగాడు. ఆ తర్వాత అన్నం తిని మద్యం మత్తులోనే బయటకు వెళ్లాడు. నిర్భయ దుర్ఘటన జరిగినప్పుడు బస్సు దరిదాపుల్లో కూడా లేడని పవన్‌ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ పవన్‌ గుప్తా ఫోన్‌ కాల్‌ డేటా పరిశీలిస్తే అతను నేరం జరిగిన సమయంలో బస్సులోనే ఉన్నాడని బయటపడింది. 

వినయ్‌ శర్మ, జిమ్‌ ట్రైనర్‌  
వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్‌ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిట్‌నెస్‌ ట్రైనర్‌. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలడు. పోలీసులు అతనిని జిమ్‌ బయటే అదుపులోనికి తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో తాను బస్సు దగ్గర లేనని, ఒక సంగీత కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లానని వినయ్‌ శర్మ పదే పదే చెప్పుకున్నాడు. 2016లో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ జైలు అధికారులు అతనిని కాపాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జైలు గోడలకి తలని బాదుకొని గాయపరుచుకున్నాడు.  

అక్షయ్‌ ఠాకూర్, స్కూల్‌ డ్రాపవుట్‌
అక్షయ్‌ ఠాకూర్‌ (31) బీహార్‌ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్‌ డ్రాపవుట్‌ అయిన అక్షయ్‌ 2011లో బీహార్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన అయిదు రోజుల తర్వాత అక్షయ్‌ని బీహార్‌లో అతని స్వగ్రామం తాండ్వాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్షయ్‌ భార్య తన కుమారుడితో కలిసి బీహార్‌లోనే ఉంటోంది. ఉరితీతకు మూడు రోజుల ముందు అతను రెండోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు. అక్షయ్‌ ఉరి శిక్షకు ముందు తాను వితంతువుగా జీవితాంతం బతకనని, తనకి విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య కోర్టుకెక్కింది. 

మరిన్ని వార్తలు