త్వరలో ‘డిజిటలైజేషన్‌’పై పూర్తి స్థాయి నివేదిక

23 Feb, 2017 02:09 IST|Sakshi
త్వరలో ‘డిజిటలైజేషన్‌’పై పూర్తి స్థాయి నివేదిక

ఏపీ సీఎం చంద్రబాబు

ముంబై: దేశంలో లావాదేవీలను ‘డిజిటలైజ్‌’ చేయడంపై త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని కమిటీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కార్డు లావాదేవీల మీద అధిక చార్జీల వసూలుపై ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. ముంబైలో బుధవారం మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. డిజిటలైజేషన్‌పై ఐదుగురు సీఎంలు, నీతి ఆయోగ్‌ సభ్యులం సంయుక్తంగా పని చేస్తున్నామని, ఇటీవలే దీనిపై మధ్యంతర నివేదిక సమర్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విధానాలు, ప్రజలు డిజిటల్‌లోకి మళ్లేందుకు ప్రోత్సాహకాలు వంటి వాటిపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. పీఓఎస్‌లపై అద్దె వసూలు, ఇతర సర్వీసు చార్జీలు అధికంగా ఉన్నాయని, వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.  

మైక్రోసాఫ్ట్‌ సీఈఓతో చంద్రబాబు భేటీ
సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై చర్చించారు. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించి ప్యూచర్‌ డీకోడెడ్‌ అనే అంశంపై బుధవారం జరిగిన సాంకేతిక సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.
 
దేశంలోనే తొలి నగదు రహిత నగరం విశాఖ
న్యూఢిల్లీ: దేశంలోనే ‘తొలి నగదు రహిత నగరం’గా ఏపీలోని విశాఖపట్నం పేరుగాంచనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు పేమెంట్స్‌ నెట్‌వర్క్‌ సంస్థ ‘వీసా’ ముందుకొచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరంలో ఈ– చెల్లింపులు 70 శాతం నుంచి 100 చేరుకుంటాయని సీఎం చంద్రబాబు  అన్నారు. కాగా  విశాఖను భారతదేశపు ‘ఫిన్‌టెక్‌ వ్యాలీ’గా మార్చేందుకు కూడా సహకరిస్తామని ‘వీసా’ సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు