సచిన్‌పై ఎగతాళి వీడియో

31 May, 2016 02:16 IST|Sakshi
సచిన్‌పై ఎగతాళి వీడియో

- లతా మంగేష్కర్‌పై కూడా...
- కలకలం రేపిన తన్మయ్ వీడియో.. సర్వత్రా నిరసనజ్వాలలు
- ఫేస్‌బుక్, యూట్యూబ్ నుంచి తొలగించాలన్న పోలీసులు
 
 ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లను ఎగతాళి చేస్తూ కమెడియన్ తన్మయ్ భట్ రూపొందించిన వీడియోపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు, రాజకీయనేతలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించా రు. తన్మయ్‌ను అరెస్టు చేయాలని, వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ బీజేపీ, శివసేన, ఎంఎన్‌ఎస్‌తో పాటు పలువురు సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీడియోను ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల నుంచి తొలగించాంటూ పోలీసులు వాటి యాజమాన్యాలకు సూచించారు. ‘సచిన్ వర్సెస్ లత సివిల్ వార్’ పేరిట ఈనెల 26న వీడియోను ఏఐబీ గ్రూపు తరఫున తన్మయ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఎవరు గొప్ప క్రికెటర్ అన్న అంశంపై లతా మంగేష్కర్, సచిన్‌ల మధ్య సంభాషణను ఇందులో అసభ్యంగా రూపొందించాడు. తన్మయ్ తన గొంతుతో సచిన్, లతను మిమిక్రీ చేస్తూ వారి ముఖాల్ని తన ముఖంతో ఫేస్ స్వాప్ (ఒక ముఖంలో ఇద్దరి పోలికలు కలిపి మాట్లాడుతున్నట్లు) చేసి వీడియోను తయారుచేశాడు. విరాట్ కోహ్లీని సచిన్ గొప్పవాడని ఒప్పుకుంటూనే మధ్య మధ్యలో తిట్టడం, విరాట్ గొప్ప ఆటగాడని లత అనడంపై సచిన్ కోప్పడటం, అంత్యక్రియలపై పరిహాసం చేస్తూ ఈ పేరడీని చిత్రీకరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీడియోపై శివాజీ పార్క్ పోలీసుస్టేషన్‌లో ఎంఎన్‌ఎస్ ఫిర్యాదు చేసిందని ముంబై డీసీపీ(ఆపరేషన్స్) సంగ్రామ్‌సింగ్ నిషందర్ తెలిపారు.

ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, వీడియోలో వాడిన పదాల్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకునేముందు నిపుణుల నుంచి న్యాయ సలహాలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ముంబై పోలీసు కమిషనర్‌కు నగర బీజేపీ అధ్యక్షుడు అశిష్ షేలర్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక విభాగం విచారణ ప్రారంభించిందని డీసీపీ తెలిపారు. తన్మయ్‌ను కొడతామని, ముంబైలో అతని కార్యక్రమాలు జరగనివ్వమని ఎంఎన్‌ఎస్ హెచ్చరించింది. జాతీయ ప్రముఖుల్ని గేళి చేసి సామాజిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని శివసేన ఆరోపించింది.
 
 బాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహం
 తన వీడియోను తన్మయ్ సమర్థించుకున్నారు. అందులో ఎలాంటి తప్పులేదని, వీడియో నచ్చినవాళ్లు తన మెయిల్‌కు అభిప్రాయాలు పంపాలంటూ ట్వీట్ చేశాడు. హాస్యానికి, అవమానానికి మధ్య తేడాను కమెడియన్లుఅర్థం చేసుకోవాలంటూ సచిన్ భార్య అంజలీ స్పందించారు. మరోవైపు తన్మయ్ వీడియోపై ట్విట్టర్‌లో మాటల యుద్ధం కొనసాగింది. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ స్పందిస్తూ.. ఇలా ఏ మహిళ గురించైనా అసభ్యంగా మాట్లాడడం పాపమని, పైగా మంగేష్కర్ గురించా.. అంటూ ట్వీట్ చేశారు. తన్మయ్ మంచి కమెడియన్ అని.. ఈ సారి మాత్రం చాలా చెడ్డ కామెడీ చేశాడంటూ డెరైక్టర్ మిలాప్ జవేరీ విమర్శించారు. నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. తాను 9 సార్లు ఉత్తమ కమెడియన్‌గా అవార్డు అందుకున్నానని, హాస్యాన్ని అభిమానిస్తానని, అయితే తన్మయ్‌ది హాస్యం కాదన్నారు.

>
మరిన్ని వార్తలు