శివకుమార స్వామికి కన్నీటి వీడ్కోలు

23 Jan, 2019 03:53 IST|Sakshi

పెద్దసంఖ్యలో హాజరైన ప్రముఖులు 

స్వామీజీ తనపై ప్రేమ కురిపించే వారన్న మోదీ  

తుమకూరు: కన్నడనాట ఆధ్యాత్మిక, విద్యా ప్రదాత తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్‌ శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు మంగళవారం భక్తుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. 111 ఏళ్ల స్వామి సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత సుమారు లక్ష రుద్రాక్షలతో నిర్మించిన పల్లకిలో 400 మీటర్ల దూరంలోని సమాధి ప్రదేశం వరకు ఊరేగింపుగా తెచ్చారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, కేంద్రమంత్రులు సదానందగౌడ, నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని దేవెగౌడ, పలువురు మాజీ సీఎంలు, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. ప్రధాని మోదీ వారణాసిలో మాట్లాడుతూ శివకుమార స్వామి దగ్గరకు తాను ఎప్పుడు వెళ్లినా తనను కొడుకులా భావించి ప్రేమను కురిపించి ఆశీర్వదించే వారనీ, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందని అన్నారు.  

వీరశైవ లింగాయత్‌ సంప్రదాయంలో...
వీరశైవ లింగాయత్‌ సంప్రదాయం ప్రకారం శివకుమార స్వామి అంత్యక్రియలు జరిగాయి. కొత్త కాషాయ వస్త్రాలను ముందుగా స్వామి పార్థివ దేహానికి తొడిగి, అనంతరం కూర్చున్న భంగిమలో ఉంచి దేహంపై త్రివర్ణపతాకాన్ని కప్పారు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. గతంలోనే స్వామి సూచించిన భవనంలో సమాధిని తవ్వి ఉంచారు. శివకుమార స్వామి పార్థివ దేహాన్ని క్రియా సమాధిలో ఉంచి రాష్ట్రంలోని నదుల నుంచి తెచ్చిన పుణ్య జలాలతో అభిషేకించారు. ఆ తర్వాత రెండు క్వింటాళ్ల విభూతి, 900 కేజీల ఉప్పు, బిల్వ పత్రాలు సమాధిలో ఉంచారు. ఆ తర్వాత పద్మాసనంలో స్వామిజీని కూర్చొబెట్టి ఖననం చేశారు.

మరిన్ని వార్తలు