ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు

29 Jul, 2016 01:23 IST|Sakshi
ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు

విజయ్‌కాంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: పరువునష్టం దావా కేసుల్ని ప్రభుత్వాల్ని విమర్శించే వారిపై రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కని, విమర్శిస్తే పరువునష్టం దావాలు వేస్తారా? అంటూ అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతలపై పరువునష్టం దావా కేసులో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్‌పై గురువారం స్టే మంజూరు చేస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది.

పరువునష్టం కేసులో హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు బుధవారం విజయకాంత్, ఆయన భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. జయలలితపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రభుత్వ పనితీరును విమర్శించారంటూ నవంబర్ 6, 2015న తిరుప్పూరు జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు పెట్టారు.   తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ఇంతవరకు దాఖలు చేసిన పరువునష్టం దావాల జాబితాను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది.

విమర్శలపై సహనం పాటించాలని, ఎవరైనా అవినీతి, అసమర్థ ప్రభుత్వం అని విమర్శిస్తే పరువునష్టం దావా వేయలేరని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్.ఎఫ్.నారిమన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు వేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదని, విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కని సుప్రీం వ్యాఖ్యానించింది. తమిళనాడులో మాత్రమే ఇన్ని పరువునష్టం కేసులు ఎందుకు దాఖలవుతున్నాయని, తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై ఇంతవరకు దావాలు వేశారో ఆ జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 21కి వాయిదావేసింది.

మరిన్ని వార్తలు