2021 డిసెంబర్‌లో ‘గగన్‌యాన్‌’!

12 Jan, 2019 02:50 IST|Sakshi
ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌

ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ వెల్లడి

సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలవనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టును డిసెంబర్‌ 2021లోగా చేపట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ వెల్లడించారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా పంపే ముగ్గురు వ్యోమగాముల్లో భారతీయులే ఉండే అవకాశం ఉందని, వీరిలో ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు తెలిపారు. వీరిలోనే భారత వాయుసేనకు చెందిన వ్యక్తి కూడా ఉండనున్నట్లు చెప్పారు.

శుక్రవారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మీడియాతో శివన్‌ మాట్లాడారు. 2021లో చేపట్టే మానవసహిత అంతరిక్ష ప్రయోగాని కంటే ముందే డిసెంబర్‌ 2020–జూలై 2021 మధ్య మానవ రహిత మిషన్లను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఇస్రోకు రూ.9,023 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించినట్లు చెప్పారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు భారత్‌లోనే శిక్షణ ఇస్తామని చెప్పారు. ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇప్పించాలని యోచిస్తున్నారు.  

ఏప్రిల్‌లో చంద్రయాన్‌–2
ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని ఏప్రిల్‌ నెలలో చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నట్లు శివన్‌ శుక్రవారం తెలిపారు. ముందుగా చంద్రుడిపైకి చంద్రయాన్‌–2ను ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 తేదీల మధ్యలో పంపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల ప్రయోగ తేదీని వాయిదా వేసినట్లు తెలిపారు. 10 ఏళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్‌–1కు ఆధునిక రూపమైన చంద్రయాన్‌–2ను రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టారు.

చంద్రయాన్‌–2 రోవర్‌ ద్వారా చంద్రుడిపై వాతావరణాన్ని పరీక్షిస్తామని శివన్‌ తెలిపారు. చంద్రయాన్‌–2 నౌక చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేలా తొలిసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరో 3 నెలల్లో ఇస్రో టీవీని తీసుకొస్తామని తెలిపారు. ఇస్రో టీవీ ద్వారా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయం తదితర అంశాలను ప్రసారం చేస్తామని చెప్పారు. 2020 జనవరిలో అంతర గ్రహ గగనయానానికి సంబంధించిన ఆదిత్య ఎల్‌–1 ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జీశ్యాట్‌–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు