‘గగన్‌యాన్‌’ సాధ్యమే!

16 Aug, 2018 03:16 IST|Sakshi

ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడి

చెన్నై: 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్‌ కె. శివన్‌ వెల్లడించారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతామని చెప్పారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయమే అవుతుందని తెలిపారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్‌’ గురించి ప్రకటన చేసిన నేపథ్యంలో శివన్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘జీఎస్‌ఎల్‌వి మార్క్‌–3 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్‌ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్‌ క్రాప్ట్‌లను పంపుతాం. రూ.10వేల కోట్ల కన్నా తక్కువ వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌లను ఇది వరకే పరీక్షించాం. వ్యోమగామికి లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్, స్పేస్‌ సూట్‌ లాంటి వాటిని తయారుచేసే దశలో ఉన్నాం. అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిని వాయుసేన ఎంపిక చేస్తుంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు