ఉత్తరాఖండ్‌ రెండో రాజధానిగా గైర్‌సెయిన్‌

9 Jun, 2020 05:31 IST|Sakshi

డెహ్రాడూన్‌: చమోలీ జిల్లాలోని గైర్‌సెయిన్‌ పట్టణాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. గైర్‌సెయిన్‌ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ పేర్కొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గైర్‌సెయిన్‌కు దక్కిన వేసవి రాజధాని హోదాను ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్‌సెయిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తాము అధికారంలోక వస్తే గైర్‌సెయిన్‌ను వేసవి రాజధానిగా మారుస్తామంటూ 2017 అసెంబ్లీ ఎన్నికల దార్శనిక పత్రంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్‌ నగరం ఉత్తరాఖండ్‌ పరిపాలనా రాజధానిగా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు