-

ఇంతకీ ఈ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి?

25 Apr, 2015 11:31 IST|Sakshi
ఇంతకీ ఈ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి?

న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు 'మీరంటే మీరు కారణం' అంటూ ఓ పక్క రాజకీయ పార్టీలు కొట్టుకు చస్తుంటే మరోపక్క కేసును ఎవరు దర్యాప్తు చేయాలి ? ఎవరిదా అధికారం ? అన్న అంశంలో జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ పోలీసు అధికారులు సంఘర్షణ పడుతున్నారు. ఒకవేళ జిల్లా మేజిస్ట్రేటే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తే అది పోలీసు అధికారుల దర్యాప్తులో వెలువడిన అంశాలకు భిన్నంగా ఉంటే అనవసర గందరగోళానికి దారితీస్తుందని, పైగా కోర్టు ముందు అభాసుపాలు కావాల్సి వస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ పోలీసు కమిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే కేసుపై జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే.

ఈ కేసు మీ పరిధిలోకి రాదంటూ ఢిల్లీ పోలీసు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయడంతో వివాదం మొదలైంది. కేసు దర్యాప్తును ఇప్పటికే చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సమాచారం ఏదైనా ఉంటే తనకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే టీవీ ఫుటేజ్‌లు సమర్పించాల్సిందిగా టీవీ చానళ్లను ఆదేశించారు. అంతేకాకుండా శుక్రవారంలోగా ప్రాథమిక దర్యాప్తు వివరాలను సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసు అధికారులను కూడా ఆదేశించారు. తన ఆదేశాలను ధిక్కరిస్తే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వారిని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తున్న ఢిల్లీ పోలీసు అధికారులు మేజిస్ట్రేట్ ఆదేశాలను ఖాతరు చేయలేదు. వారికిచ్చిన గడువుకు కూడా తీరిపోవడంతో న్యాయపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం.

ఓపక్క కేసును మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తుంటే అది తమ దర్యాప్తుకేమీ అడ్డంకాదని, అయితే పరస్పర భిన్నంగా దర్యాప్తు నివేదిలుంటేనే గందరగోళం అవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ క్రైమ్‌బ్రాంచి అధికారి మీడియాకు తెలిపారు. 2014లో ఢిల్లీ నగరంలో 7,545 అసహజ మరణాలు సంభవించాయని, ఇందులో వేటిలోనూ జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించలేదని ఆయన తెలిపారు. అలాంటిది ఈ కేసులో మాత్రం ఎందుకు అంతగట్టిగా పంతం పడుతున్నరన్నది అర్థం కావడం లేదన్నది ఆయన ఆవేదన.పెళ్లైన ఏడేళ్లలోపు మహిళలెవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తేనే జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు అవసరమవుతుందని సీనియర్ పోలీసు అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి  కే సుల విచారణలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, గోప్యత అవసరమని, చట్టాల ప్రకారమే అన్ని విభాగాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.

ప్రాథమిక పోస్టుమార్టమ్ నివేదిక ప్రకారం ఉరివేసుకోవడం వల్లనే గజేంద్ర సింగ్ చనిపోయినట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని 174(1), 176(1) సెక్షన్ల ప్రకారం ఏ కేసులోనైనా జిల్లా మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోవచ్చని, ఏ అధికారినైనా పిలిపించి దర్యాప్తునకు ఆదేశించవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వాదన ఎలా ఉన్నా, ప్రస్తుత కేసులో సంఘర్శణకు కారణం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో పని చేస్తుండడం, జిల్లా మేజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుండడం తెల్సిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఆప్ అధికారులో ఉండడం వల్ల అటు రాజకీయంగా మొదలైన రగడ ఇటు ప్రభుత్వ విభాగాల మధ్య సంఘర్షణకు కూడా దారితీసింది.
 

 

మరిన్ని వార్తలు