‘కుమారస్వామి పాము లాంటోడు.. అందుకే’

15 Nov, 2018 19:30 IST|Sakshi

కర్ణాటక సీఎంపై విరుచుకుపడ్డ గాలి జనార్ధన్‌ రెడ్డి

సాక్షి, బెంగళూరు : ‘కుమారస్వామి పాము లాంటోడు. అందుకే నన్ను జైలుకు పంపించి తన పాత పగను తీర్చుకున్నాడు’ అంటూ కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి సీఎం కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. ‘యాంబిడంట్‌’ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టైన జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన.. మీడియాతో సుమారు 45 నిమిషాల పాటు సంభాషణ సాగించడం విశేషం.

మేం కూడా బాధితులమే..
‘యాంబిడెంట్‌ కంపెనీ నా సెక్రటరీ అలీఖాన్‌ కుటుంబాన్ని మోసం చేసింది. ఈ కారణంగా యాంబిడెంట్‌కు చెందిన ఫరీద్‌పై ఫిర్యాదు చేసేందుకు మేం సిద్ధమయ్యాం. దీంతో భయపడిపోయిన ఫరీద్‌ నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. పోలీసులకు ఈ విషయం గురించి చెప్పొద్దని, పెట్టుబడిదారులందరికీ వారి డబ్బులు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. మానవత్వంతో నేను కూడా సరేనన్నాను. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆధారంగా చేసుకుని నన్ను ఈ కేసులో ఇరికించారు. జరిగింది ఇదే. నిజం చెప్పాలంటే ఈ కేసులో మేం బాధితులమే గానీ నేరస్తులం కాదు’ అని జనార్ధన రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బంగారు కడ్డీలు కొనడానికి యాంబిడెంట్‌ ప్రజల సొమ్మును ఉపయోగించిన విషయం తన సెక్రటరీ అలీఖాన్‌కు తెలియదని పేర్కొన్నారు. 

అతడిది పాము పగ..
సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న జనార్ధన రెడ్డి... పాత పగను దృష్టిలో పెట్టుకునే తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. 2006లో బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం గాలి జనార్దన్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారస్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మైనింగ్‌ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని గాలి జనార్దన్‌ ఆరోపణలు చేశారు.

తాజాగా మీడియాతో ఈ విషయాలను ప్రస్తావించిన జనార్ధన్‌ రెడ్డి... ఆనాటి విషయాలు మనసులో పెట్టుకునే సీఎం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన పాములాంటోడని.. గతంలో తనను అరెస్టు చేయించలేక పోయినందుల్లే ప్రస్తుతం ఇలా పగ సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు.  

నీకు ఉన్నది 37 ఎమ్మెల్యేలే గుర్తుపెట్టుకో..
అక్రమ మైనింగ్‌ కేసులో శిక్ష అనుభవించి విడుదలైన నాటి నుంచి లో ప్రొఫైల్‌ మెయింటేన్‌ చేస్తున్నానని గాలి జనార్ధన్‌ అన్నారు. అప్పటి నుంచి ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. కానీ కుమారస్వామి తనను అలా ఉండనివ్వదలచుకోవడం లేదన్నట్లుగా అన్పిస్తోందని అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారని, అయితే జడ్జి నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల తనకు బెయిలు లభించిందని పేర్కొన్నారు. 

అంతేకాకుండా కుమారస్వామికి ఉంది కేవలం 37 మంది ఎమ్మెల్యేలేనని.. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని జనార్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. పనిలో పనిగా తనను దూరంగా పెడుతున్న బీజేపీకి కూడా చురకలు అంటించారు. కాగా 600 కోట్ల రూపాయల విలువైన పోంజీ స్కామ్‌ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్న ఆరోపణలతో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌  గత ఆదివారం గాలి జనార్ధన్‌ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు