మావోయిస్ట్‌ చీఫ్‌గా బసవరాజ్‌

6 Nov, 2018 15:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్ట్‌ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్‌గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్‌ సారథిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు కావడం గమనార్హం.

కాగా గణపతి తలపై రూ 49 లక్షల రివార్డు ప్రకటించగా, బసవరాజ్‌కు పట్టిఇచ్చిన వారికి రూ 36 లక్షల రివార్డును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు రెండు నెలల కిందటే మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుందని తెలంగాణ పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అరకులో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు బసవరాజు వ్యూహం రూపొందించారని తాము భావిస్తున్నామని తెలిపాయి.

అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గణపతి స్ధానంలో చురుకుగా ఉండే యువ నేతను ఎంపిక చేసుకునేందుకు వీలుగా పార్టీ పగ్గాలను వీడాలని గణపతికి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో నాయకత్వ మార్పు జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైన్స్‌, బీఈడీల్లో గ్రాడ్యుయేట్‌ అయిన భూస్వామ్య రైతు కుటుంబానికి చెందిన గణపతి మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు