లైంగిక ఆరోపణలు అవాస్తవం: స్టార్‌ కొరియోగ్రాఫర్‌

2 Feb, 2020 11:19 IST|Sakshi

స్టార్‌ కొరియోగ్రాఫర్‌,ఐఎఫ్‌టీసీఏ(ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కొరియోగ్రాఫర్‌ అసోసియేషన్‌) ప్రధాన కార్యదర్శి గణేశ్‌ ఆచార్య తనపై వస్తున్న వేధింపుల ఆరోపణలపై స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాడు. తనపై అసత్య నేరాన్ని మోపుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైకి చెందిన ముప్పైమూడేళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌.. గణేశ్‌ తనను లైంగికంగా వేధించాడంటూ జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలసిందే. ఈ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనకొచ్చే ఆదాయంలో కమీషన్‌ కావాలని బెదిరించేవాడంది. అంతేకాక అశ్లీల వీడియోలు చూడాలని తనను బలవంతపెట్టేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం అతని వల్ల ఉద్యోగం కూడా కోల్పోయానని వాపోయింది.

దీనిపై స్పందించిన గణేశ్‌ ‘నాపై వస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కావు. నేను 2007లో పనిచేసిన బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. అంతకుమించి ఆమె గురించి నాకేమీ తెలియదు. ఓరోజు ఆమె ఇద్దరు వ్యక్తులతో గొడవకు దిగడానికి ముందే నేను షూటింగ్‌కు వెళ్లిపోయాను. తనకు అశ్లీల వీడియోలు చూడమని చెప్పడం అబద్ధం. ఆమె చెప్తున్నవన్నీ నిరాధారమైనవి’ అని పేర్కొన్నాడు. ఆమె ఆదాయంలో వాటా కావాలన్న వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించాడు. తానెందుకు ఆమె ఆదాయంలో కమీషన్‌ కోరుతానని అసహనం వ్యక్తం చేశాడు. గతంలో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా, సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ సైతం గణేశ్‌పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనతో బాలీవుడ్‌లో మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ ప్రకంపనలు మొదలయ్యాయి.

చదవండి: మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు..

మరిన్ని వార్తలు