గంగా ఉద్యమ యోధుడు కన్నుమూత

12 Oct, 2018 03:14 IST|Sakshi
బుధవారం అగర్వాల్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

111 రోజులు దీక్ష చేసిన అగర్వాల్‌

గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్‌ జి.డి.అగర్వాల్‌(86) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్‌ ఐఐటీ మాజీ ప్రొఫెసర్‌ అయిన అగర్వాల్‌.. గంగానది ప్రక్షాళనకు తన జీవితాన్ని అంకితం చేశారు. గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్‌ గత జూన్‌ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ ఈనెల 9న ప్రకటించారు.

ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్‌లోని  ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లో 1932లో జన్మించిన అగర్వాల్‌.. రూర్కీ వర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్‌ పొందారు. అనంతరం కాన్పూర్‌ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1979లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మొదటి మెంబర్‌ సెక్రెటరీగా పని చేశారు. అదే సమయంలో ఐఐటీ రూర్కీలో విజిటింగ్‌ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్‌ సనంద్‌గా మార్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు