ముం'చెత్త'తోంది

20 Mar, 2017 02:26 IST|Sakshi
ముం'చెత్త'తోంది

ఇంట్లో చెత్త బయట పడేస్తున్నాం.. ఇల్లు శుభ్రమైందని చేతులు దులిపేసుకుంటున్నాం..
ట్రక్కుల కొద్దీ చెత్తను ఊరి శివార్లలో పడేస్తున్న అధికారులూ.. ఓ పనైపోయిందని అంటున్నారు..
అంతా బాగానే ఉంది.. కానీ పీల్చే గాలి.. తాగే నీరు.. తినే తిండి.. అన్నీ ఇప్పుడు కాలుష్య కాసారాలే..
డెంగీ, చికున్‌ గున్యా ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. అసలు ఎక్కడుంది సమస్య? పరిష్కారం ఏమిటి?


సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ : నిజం ఏమిటంటే.. దేశంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతోందో ప్రభుత్వానికీ స్పష్టంగా తెలియదు. తెలిసిందల్లా.. ఒక్కో మనిషి రోజుకు కనిష్టంగా 300 గ్రాములు.. గరిష్టంగా 600 గ్రాములు చెత్త ఉత్పత్తి చేస్తాడని.. దీన్ని జనాభా సంఖ్యతో హెచ్చవేసి.. ఫలానా నగరంలో రోజుకు ఇంత చెత్త ఏర్పడుతోందన్న అంచనాలే! 2012 నాటి కస్తూరి రంగన్‌ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 5.2 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అంటే.. ప్రతి రోజూ దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తన్నమాట. దక్షిణాదిని మాత్రమే తీసుకుంటే రోజుకు 36,400 టన్నులు. ప్రభుత్వ యంత్రాంగం ఇందులో మూడో వంతును మాత్రమే డంపింగ్‌ యార్డ్‌లకు చేరుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో ముప్ఫై ఏళ్లలో చెత్త పారబోసేందుకే దాదాపు నాలుగు లక్షల ఎకరాల స్థలం కావాలి! ఇది ముంబై, చెన్నై, హైదరాబాద్‌ మూడింటినీ కలిపితే వచ్చేంత భూ భాగం!

అంతా కలగాపులగం..
రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) ఈ ‘చెత్త’సమస్యపై ఒక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? నిర్వహణ ఎలా ఉంది? అన్న అంశాలపై జరిగిన ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నాట్‌ ఇన్‌ మై బ్యాక్‌యార్డ్‌ పేరుతో విడుదలైన పుస్తకంలో భారతదేశంలోని నగరాల్లో చెత్త సమస్యను సవివరంగా ప్రస్తావించింది. వంటింటి వ్యర్థాలు, ప్లాస్టిక్, లోహపు వస్తువులు, కాగితం, రబ్బర్‌ వంటి వాటన్నింటినీ కలగలిపి పారబోస్తూండటం.. చెత్తను సమర్థంగా నిర్వహించడంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన 3ఆర్‌ సూత్రాల (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌)ను పాటించకపోవడం కూడా సమస్య తీవ్ర రూపం దాల్చేందుకు ఇంకో కారణం. అంతేకాక చెత్తనంతా ఒకేదగ్గరకు చేర్చి భారీ యంత్రాలు, టెక్నాలజీల సాయంతో సమస్యను అధిగమించాలన్న ఆలోచన కూడా సరికాదని అంటున్నారు సీఎస్‌ఈ డైరెక్టర్‌ సునీతా నారాయణ్‌.

వెలుగు దివ్వెలు ఇవిగో..
చెత్త సమస్యను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలోని అలెప్పీ, గోవా రాజధాని పణజి, బెంగళూరు, మైసూరు, ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి వంటివి ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. అలెప్పీ విషయాన్నే తీసుకుంటే.. ప్రతి ఇంట్లోనూ తడి, పొడి చెత్తలు వేర్వేరు చేయాల్సిందేనని.. లేదంటే ఇళ్ల నుంచి చెత్త సేకరించమని స్పష్టం చేసింది. ప్రజలు కొంత కాలం అసంతృప్తి వ్యక్తం చేసినా.. నెమ్మదిగా దీని ప్రాముఖ్యతను గుర్తించారు. ఫలితంగా ప్రస్తుతం అలెప్పీ స్వచ్ఛమైన పట్టణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సేకరించిన తడి చెత్తను వివిధ పద్ధతుల ద్వారా కుళ్లబెట్టి ఎరువుగా మార్చి రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు.

పొడిచెత్తను కూడా ఇదే రకంగా నిర్దిష్ట కేంద్రాల్లో వర్గీకరించి.. ఏవిధంగానూ రీసైకిల్‌ చేయలేమనుకున్న చెత్తను మాత్రమే డంపింగ్‌ యార్డ్‌కు పంపుతున్నారు. పణజి, మైసూరుల్లోనూ ఇదే పరిస్థితి. బెంగళూరులో మాత్రం ‘హసిరుదళ’అనే స్వచ్ఛంద సంస్థ నగరంలో చెత్త ఏరుకునే వారిని ఒక ఛత్రం కిందకు తీసుకువచ్చింది. చెత్త సేకరణ వర్గీకరణల ద్వారా వారు నెలకు దాదాపు రూ.15 వేల వరకూ ఆర్జించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డులు లభించేలా చేయడంతో పోలీసుల వేధింపులు తగ్గి వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని అంటున్నారు హసిరుదళ డైరెక్టర్‌ నళినీ శేఖర్‌. అక్కడకక్కడా చెదురుమదురుగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రతిచోటా ఆచరణలోకి వచ్చినప్పుడే చెత్త సమస్యను అధిగమించవచ్చు. ఇందుకు కావాల్సింది మన ఆలోచనల్లో కొంచెం మార్పు.. రాజకీయ నాయకులు, అధికారుల చిత్తశుద్ధి మాత్రమే.

మరిన్ని వార్తలు