చెత్త సమస్యకు జబల్‌పూర్‌ స్మార్ట్‌ పరిష్కారం..

23 Dec, 2018 03:06 IST|Sakshi

చెత్త.. ఎక్కడపడితే అక్కడ.. పల్లె, పట్టణం తేడా లేదు.. రోజూ వందల టన్నుల్లో.. గుట్టలు గుట్టలుగా.. ప్రజలకు, ప్రభుత్వానికి నిజంగానే ఇదో పెద్ద ‘చెత్త’ సమస్య! 

కానీ జబల్‌పూర్‌ మున్సిపాలిటీకి మాత్రం కాదు.. ఎందుకంటే.. వాళ్లు దీనికో ‘స్మార్ట్‌’ పరిష్కారాన్ని కనిపెట్టారు..  పైగా.. దాన్నుంచి విద్యుత్‌ను కూడా తయారుచేస్తూ.. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.. అదెలాగో తెలుసుకునే ముందు.. అసలు ఏమిటీ సమస్య.. మన దగ్గర పరిస్థితేంటి అన్నది ముందుగా చూద్దాం.. 

అసలు రోజూ వందల టన్నుల్లో పోగవుతున్న చెత్తను సేకరించడం ఒక ఎత్తయితే, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయడం, యార్డులకు తరలించడం ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది. ఇళ్లలో డస్ట్‌బిన్లు చెత్తతో నిండిపోయినా మున్సిపాలిటీ వాళ్లు దాన్ని తీసుకెళ్లకపోవడం, రోడ్ల మీద చెత్తను సరిగా శుభ్రం చేయకపోవడంతో రోగాల ఇబ్బంది ఉండనే ఉంది. చాలాచోట్ల డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు స్థలాలే దొరకడం లేదు. నగర శివారుల్లో వీటిని ఏర్పాటు చేస్తే పరిసరాల్లో ఉండే వారు అభ్యంతరం చెబుతున్నారు. డంపింగ్‌ యార్డుల్లో చెత్తను తగులబెట్టడంతో పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతోంది. మన దగ్గర చూస్తే.. రోజూ 40 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగయ్యే సంగారెడ్డి మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డే లేదు. దీంతో చెత్తను రోడ్ల పక్కనే పారబోస్తున్నారు.

నిజామాబాద్‌లో డంపింగ్‌ యార్డు ఉన్నా చెత్తను నామమాత్రంగా రీసైకిలింగ్‌ చేస్తున్నారు. దీంతో సమస్య అలాగే ఉంది. కరీంనగర్‌లో డంపింగ్‌ యార్డు నగరానికి 15 కి.మీ. దూరంలో ఉండటంతో మున్సిపల్‌ సిబ్బందికి రాకపోకలు ఇబ్బందిగా మారాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 3 నగరాల్లోనే డంపింగ్‌ యార్డులున్నాయి. దీనికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత, శాఖల మధ్య సమన్వయలోపం చెత్త సమస్యను మరింత జటిలం చేస్తోంది. స్వచ్ఛ భారత్‌ కింద నగరాల్లో చెత్తను తొలగించడం కోసం ప్రభుత్వం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును అమలు చేస్తోంది. చెత్తను తడి, పొడిగా విభజించడం.. తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే ఇవి పూర్తి స్థాయిలో, శాస్త్రీయంగా జరగడం లేదు. చాలా చోట్ల మొత్తం చెత్తలో పది, ఇరవై శాతమే రీసైకిలింగ్‌ అవుతోంది.  ఇదండీ పరిస్థితి..  

ఇక జబల్‌పూర్‌కి వెళ్దాం..  అక్కడేం చేశారో చూద్దాం..  
కార్మికులకు ఆర్‌ఎఫ్‌ఐడీలు..

మధ్యప్రదేశ్‌లో మూడో పెద్ద నగరం జబల్‌పూర్‌. కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద ఈ నగరం ఎంపికయింది. ఇక్కడ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులకు ప్రభుత్వం ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) రీడర్లను ఇచ్చింది. నగరంలో ఉన్న అన్ని ఇళ్లకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అమర్చారు. పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఖాళీ చేశాక తమ దగ్గరున్న ఆర్‌ఎఫ్‌ఐడీతో ఆ ఇంటిగోడపై అమర్చిన ట్యాగ్‌ను స్కాన్‌ చేస్తారు. వెంటనే ఆ సమాచారం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతుంది. ఏ ఒక్క ఇంటి సమాచారం అందకపోయినా కమాండ్‌ సెంటర్‌ అధికారులు సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. దీంతో రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ తప్పనిసరిగా జరుగుతుంది. 

చెత్త కుండీలకు సెన్సార్లు.. 
ఇళ్ల సంగతి ఇలా ఉంటే, నగరంలోని చాలా చోట్ల కమ్యూనిటీ డస్ట్‌బిన్‌ (రెండు మూడు వీధులకు కలిపి ఏర్పాటు చేసే చెత్త కుండీ)లు ఉన్నాయి. వీటన్నింటికీ సెన్సార్లు అమర్చారు. ఈ డస్ట్‌బిన్లు 90 శాతానికిపైగా నిండగానే ఆ సెన్సార్లు కమాండ్‌ సెం టర్‌కు, సంబంధిత అధికారులకు చెత్తకుండీని ఖాళీ చేయాల్సిందిగా సందేశం పంపుతాయి. వెంటనే అధికారులు దగ్గర్లో ఉన్న మున్సిపాలిటీ టిప్పర్‌కు సమాచారం అందజేస్తారు. దీంతో ఆ టిప్పర్‌ వచ్చి చెత్తను తీసుకెళుతుంది. వందల సం ఖ్యలో ఉన్న ఈ టిప్పర్లన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించారు. దీంతో సమాచారం పంపడమే కాక వాటి రాకపోకలను కూడా నియంత్రించవచ్చు. 

విద్యుత్‌  ఉత్పత్తి ఇలా...
ఇలా సేకరించిన చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. దాన్ని నగర శివారులో 65 ఎకరాల్లో నెలకొల్పిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ ప్లాంట్‌లో రోజుకు 600 మెట్రిక్‌ టన్నుల చెత్తను శుద్ధి చేసి తద్వారా రోజూ 11.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విద్యుత్‌ 18 వేల ఇళ్లకు రోజువారీ వినియోగానికి సరిపోతుంది. దేశంలో ఇంత భారీస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ చేపడుతున్న నగరాల్లో జబల్‌పూరే మొదటిది. చెత్త నిర్వహణకు అవసరమైన స్మార్ట్‌ పరిజ్ఞానాన్ని టెక్‌ మహీంద్ర సంస్థ అందిస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థ నెలకొల్పింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు.

రోజూ ఉత్పత్తి చేసే విద్యుత్‌.. 11.5 మెగావాట్లు.
 

మరిన్ని వార్తలు