ఓఎన్‌జీసీలో మరోసారి గ్యాస్‌లీక్‌ వార్తలు, కలకలం

25 Sep, 2019 12:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం సంభవించిందన్నవార్తలు కలకలం రేపాయి. గ్యాస్ లీక్ అవుతోందని, చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నట్టు వచ్చిన వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. నవీ ముంబైలోని యురాన్‌ ప్లాంట్‌  అగ్నిప్రమాదం విషాదం జరిగిన 20 రోజుల్లోనే మరో ఉదంతం అంటూ  వచ్చిన పలు నివేదికలు స్థానికుల్లో ఆందోళన పుట్టింటాయి. అయితే ఈ నివేదికలపై  ప్రభుత్వ యాజమాన్య సంస్థ స్పందించింది. అలాంటి దేమీలేదని ఆందోళన వద్దని తెలిపింది.  సీనియర్‌ అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. 

గ్యాస్‌లీక్‌ లాంటి సంఘటన ఏదీ సంభవించలేదని సంస్థ ట్వీటర్‌  ద్వారా  వివరణ ఇచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 25 ఉదయం హైడ్రోకార్బన్ వాసన వ్యాపించిందని పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్లాంట్ సాధారణంగా నడుస్తుందని కంపెనీ తెలిపింది. కాగా నవీ ముంబైలోని యురాన్‌లోని ఓఎన్‌జిసి ప్లాంట్‌లో సెప్టెంబర్ 3న భారీగా మంటలు చెలరేగినఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురిలో ముగ్గురు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఉన‍్న సంగతి తెలిసిందే.

  చదవండి : ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం​

మరిన్ని వార్తలు