భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులు మంజూరు

29 Jun, 2020 18:58 IST|Sakshi

గౌహతి : హిందూ వివాహ బంధానికి సంబంధించి గౌహతి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన మహిళ సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతులకు గాజలు ధరించడానికి ఇష్టపడకపోతే ఆ  మహిళ తన భర్తతో పెళ్లిని తిరస్కరించినట్టేనని వాఖ్యానించింది. ఓ విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అజయ్‌ లాంబా, జస్టిస్‌ సౌమిత్రా సైకియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విధమైన తీర్పు వెలువరించింది.

ఈ కేసుకు సంబంధించి భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఓ జంటకు 2012 ఫిబ్రవరిలో వివాహం అయింది. అయితే పెళ్లైనా నెల రోజులకే కుటుంబంతో కాకుండా విడిగా ఉందామని భార్య తన భర్తపై ఒత్తిడి తెచ్చారు. తనకు ఉమ్మడి కుంటుబంలో జీవించడం ఇష్టం లేదని తెలిపారు. అయితే అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో 2013లో ఆమె భర్త ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు. అయితే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై ఆమె గృహ హింస కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన గౌహతి హైకోర్టు భార్య దాఖలు చేసిన పిటిషన్‌లో నిజం లేదని తేల్చింది.

భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య విహహ సంప్రదాయాన్ని పాటించడం లేదని.. బొట్టు పెట్టుకోవడం లేదని, గాజులు ధరించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య విడిగా ఉండటం వల్ల సంతానం కూడా కలగలేదని చెప్పాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అతడు గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన గౌహతి హైకోర్టు ఈ నెల 19న తీర్పు వెలువరించింది.

పెళ్లైన హిందూ మహిళలు సంప్రదాయం ప్రకారం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, చేతికి గాజులు వేసుకోవడం ఇష్టపడకపోతే ఆ పెళ్లిని నిరాకరించినట్టే అవుతుందని తెలిపింది. అలాగే ఆ భర్తకు విడాకులు కూడా మంజూరు చేసింది. మరోవైపు ఇటువంటి పరిస్థితుల్లో కూడా భర్తను భార్యతో కలిసి ఉండమని చెప్పడం అతడిని హింసించడమే అవుతుందని వాఖ్యానించింది.

మరిన్ని వార్తలు