‘గోమూత్రం, పేడతో కరోనాను తరిమేయొచ్చు’

3 Mar, 2020 09:09 IST|Sakshi

గౌహతి :  ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకి గజగజ వణికిపోతోంది. భారతదేశంలో కూడా రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకటి తెలంగాణలో నమోదైంది. ఈ భయంకర వ్యాధికి మందు (మెడిసిన్) కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  అసోం బీజేపీ  ఎమ్మెల్యే సుమన్‌ హరిప్రియ  మాత్రం కొత్త భాష్యం చెప్పారు. వైరస్‌కు మందు ఇదేనంటూ సెలవిచ్చారు. గోమూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్‌ను తరిమివేయవచ్చు చెప్పారు. ఇవి తీసుకుంటే వైరస్ పారిపోతుందని, మళ్లీ దరి చేరదని కూడా చెప్పారు. 

సుమన్‌ హరిప్రియ  

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బంగ్లాదేశ్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నవైనంపై చర్చ జరుగుతుండగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ‘ఆవు పేడ చాలా ప్రయోజనకరమైనదని అందరికి తెలుసు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గోమూత్రం, ఆవుపేడను వినియోగిస్తున్నారు. అదే విధంగా గోమూత్రం, ఆవు పేడతో కరోనాను కూడా తరిమేయవచ్చని నేను నమ్ముతున్నాను’ అని ఆమె అన్నారు. 

(చదవండి :  తెలంగాణలో తొలి కోవిడ్‌ కేసు నమోదు)

ఆవు పేడ చల్లిన 5 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. దీనిని తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుంటుందని ఉచిత సలహా ఇచ్చారు. పురాతన కాలంలో సాధువులు గో మూత్రం, పాలు, తేనే కలిసి తీసుకొనేవారని గుర్తుచేశారు. పంచామృతం తీసుకోవడం వల్ల వారు వేలాది సంవత్సరాలు జీవించారని చెప్పారు. గో మూత్రం, ఆవు పేడను చాలారకాల మందుల్లో పూర్వీకులు వాడేవారని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆశ్రమాల్లో ఆవులు ఉండేవని.. వాటితో ఆరోగ్యానికి కావాల్సిన మందులు తయారుచేసేవారని చెప్పారు.

మరిన్ని వార్తలు