‘జిలేబీలు తినడం ఆపి సమావేశాల్లో పాల్గొనండి’

15 Nov, 2019 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యంతో మాస్కులు లేనిదే బయట తిరగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం అంశంపై పార్లమెంట్‌ ప్యానెల్‌ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంపీ, ప్రముఖ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ డుమ్మా కొట్టారు. ఇతనితోపాటు మరికొంతమంది మంత్రులు, పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. 29 మంది ఎంపీలకుగానూ కేవలం నలుగురు మాత్రమే హాజరు కావటంతో సమావేశం రద్దయింది. ఈ ఘటనపై పార్లమెంట్‌ ప్యానెల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశానికి  గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుతం గౌతమ్‌ గంభీర్‌ ఇండోర్‌లో ఉన్నాడు. ఇండియా బంగ్లాదేశ్‌కు జరిగే మ్యాచ్‌లో కామెంట్రీ ఇస్తున్నాడు. ఇక కీలక సమావేశానికి గౌతమ్‌ డుమ్మా కొట్టడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలొ వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన గౌతమ్‌పై తిరుగుదాడి చేసింది. గౌతమ్‌ ఇండోర్‌లో జిలేబీలు తింటున్న ఫొటో షేర్‌ చేస్తూ ‘ముందు మీరు ఎంజాయ్‌ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరవండి’ అంటూ చురకలు అటించింది. మరోవైపు నెటిజన్లు కూడా గౌతమ్‌ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్‌ చేస్తున్నావా?’ అంటూ మరో నెటిజన్‌ అసహనం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు