బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో గౌతం గంభీర్‌

8 Mar, 2019 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌  రెండో ఇన్సింగ్స్‌ను  ప్రారంభించబోతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయబోతున్నారు. గంభీర్‌ను బరిలోకి దించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేతకొరు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంభీర్‌ను న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలను బీజేపీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం మీనాక్షి లేఖీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను గౌతమ్‌ గంభీర్‌ నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడమే సరైందని ఘాటు వ్యాఖ్యలు చేసిన గంభీర్‌.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఇటీవల మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పత్రికల్లో కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ట్విటర్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార ఆర్భాటాల కోసం చేసే ఖర్చును తగ్గించుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు