పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌

24 Apr, 2020 12:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘నా చిన్నారులను జాగ్రత్తగా చూసుకునే ఆమె.. ఎన్నటికీ పనిమనిషి కాబోరు. తను మా కుటుంబంలో సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ మానవత్వం చాటుకున్నారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సరస్వతి పాత్రా(49) అనే మహిళ గత ఆరేళ్లుగా గంభీర్‌ ఇంట్లో పనిచేస్తున్నారు. డయాబెటీస్‌, బీపీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న ఆమె మరణించారు. కాగా ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సరస్వతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గంభీర్‌ దృష్టికి తీసుకురాగా..  స్వయంగా తానే దగ్గరుండి సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న గంభీర్‌.. ‘‘ కుల, వర్గ, ప్రాంత, సామాజిక అంతరాలకు అతీతంగా వ్యవహరించడంలోనే హుందాతనం ఉంటుందని నమ్ముతాను. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు. నా దృష్టిలో అదే నిజమైన భారత్‌! ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశారు. (లాక్‌డౌన్‌ : పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు)

ఈ క్రమంలో పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌ సహృదయుడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సైతం గంభీర్‌ను ప్రశంసించారు. సరస్వతికి చికిత్స అందించే విషయంలో, తను మరణించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించి గంభీర్‌ మానత్వాన్ని ప్రదర్శించారన్నారు. గంభీర్‌ వ్యవహరించిన తీరు ఎంతో మందికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కాగా లాక్‌డౌన్‌ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఆత్మీయులను కడసారి చూసుకునే వీలు లేకుండా చేస్తోంది. 

>
మరిన్ని వార్తలు