ముఫ్తి ట్వీట్‌.. గంభీర్‌ కౌంటర్‌

4 Jun, 2019 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర హోం మంత్రి చొరవ తీసుకుంటారని భావించడం మూర్ఖత్వమే అవుతుందని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయినపుడే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు..‘ 1947 నుంచి ఏర్పడిన ప్రభుత్వాలన్నీ కశ్మీర్‌ను ఒక భద్రతా సమస్యగానే చూస్తున్నారు. రాజకీయంగా నెలకొన్న సమస్యలు ముగిసిపోవాలంటే పాకిస్తాన్‌ సహా అన్ని రాజకీయ పార్టీలన్నీ ఇందులో భాగమైనపుడే ఒక ముగింపు వస్తుంది. అయితే ఇప్పుడున్న హోం మంత్రి ద్వారా కశ్మీర్‌ సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది’  అని అమిత్‌ షాను ఉద్దేశించి ముఫ్తి ట్వీట్‌ చేశారు.

కాగా ముఫ్తి ట్వీట్‌పై బీజేపీ ఎంపీ గౌతం  గంభీర్‌ స్పందించారు. ‘ చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని నాలాంటి వాళ్లు భావిస్తుంటే మెహబూబా ముఫ్తి మాత్రం అమిత్‌ షా అనుసరించే విధానాలను ఎద్దేవా చేస్తున్నారు. సహనం వహించినందు వల్ల ఏం జరిగిందనే విషయానికి చరిత్రే సాక్ష్యం. ఒకవేళ అణచివేతకు గురైన వారు నా ప్రజల భద్రతకు హామీ ఇవ్వగలిగితే వాళ్లు చెప్పినట్టే చేస్తాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తామని అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మీరు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయండి. మేం ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్‌ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తి ఆయనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 

మరిన్ని వార్తలు