పాక్‌ సైన్యం చేతిలో ఇమ్రాన్‌ తోలుబొమ్మ: గంభీర్‌

28 Sep, 2019 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ ఆర్మీ చేతిలో తోలుబొమ్మ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి వేదికపై యుద్ధం గురించి మాట్లాడుతూ తన వ్యక్తిత్వం ఏమిటో మరోసారి నిరూపించుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు కేటాయించిన పదిహేను నిమిషాల సమయాన్ని ఇతరులపై ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఇమ్రాన్‌ వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ప్రతీ దేశానికి 15 నిమిషాలు కేటాయించారు. ఎవరి వ్యక్తిత్వం ఏమిటో.. ఎవరి శక్తిసామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాల్సిన సమయం అది. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి, అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటే.. పాకిస్తాన్‌ సైన్యం చేతిలోని తోలుబొమ్మ మాత్రం అణ్వాయుద యుద్ధం జరుగుతుంది అంటూ బెదిరింపులకు దిగింది. మళ్లీ అదే వ్యక్తి కశ్మీర్‌లో శాంతి అంటూ ఏవేవో మాట్లడతారు’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశారు.(చదవండి : కలిసికట్టుగా ఉగ్ర పోరు: మోదీ)

కాగా ఐక్యరాజ్యసమితి సమావేశంలో భాగంగా భారత ప్రధాని మోదీ శుక్రవారం మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘భారత్‌ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది’ అని భారత జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. అదే విధంగా వాతావరణ మార్పులతో పాటు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ వంటి సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో ఉటంకించారు. ఇక పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తనకు కేటాయించిన పదిహేను నిమిషాలను పొడగిస్తూ దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో ఎక్కువ భాగం భారత ప్రభుత్వం, కశ్మీర్‌, ఆరెస్సెస్‌లపై ఆరోపణలు గుప్పిస్తూ.. ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందంటూ బెదిరింపులకు దిగారు.(చదవండి : యుద్ధం వస్తే తీవ్ర పరిణామాలు: ఇమ్రాన్ ఖాన్‌)

మరిన్ని వార్తలు