ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది!!

31 Aug, 2018 16:10 IST|Sakshi

పౌర హక్కుల నేత గౌతమ్‌ నవలఖా సహచరిణి సభా హుస్సేన్‌

సాక్షి, న్యూఢిల్లీ : భీమా- కోరెగావ్‌ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావు, పౌర హక్కుల కార్యకర్తలు  గౌతం నవలఖా, వెర్నన్‌ గొంజాల్వెజ్, అరుణ్‌ ఫెరీరా, న్యాయవాది సుధా భరద్వాజ్‌లను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వారిని జైలుకు పంపకుండా.. గృహ నిర్బంధంలో ఉంచితే చాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే పౌర హక్కుల నేతల అరెస్టు సమయంలో, వారికి గృహ నిర్బంధం విధించిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గౌతమ్‌ నవలఖా స్నేహితురాలు సభా హుస్సేన్‌... మీడియాకు తెలిపిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి.

బెడ్‌రూం తలుపులు కూడా వేయొద్దంటున్నారు..
గౌతమ్‌ నవలఖాకు గృహ నిర్బంధం విధించిన నాటి నుంచి.. ఢిల్లీలోని నెహ్రూ ఎన్‌క్లేవ్‌లో ఆయనతో పాటు కలిసి ఉంటున్న సభా హుస్సేన్‌ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. ‘బెడ్‌ రూం తలుపులు తెరిచే పడుకోవాలని పోలీసులు మాకు చెప్పారు. దాంతో నాకు కోపం వచ్చింది. ముందు మాకు క్షమాపణ చెప్పండి అని వారిని అడిగానంటూ’ సభా తెలిపారు. ఇలా ప్రతీ గదిపై పోలీసులు నిఘా వేసి ఉంచడం.. గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించారు.

ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది..
నవలఖా ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారన్న సభా... ‘ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం. పొద్దున లేచింది మొదలు నిద్ర పోయే వరకు వారు(పోలీసులు) మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. దీంతో మనశ్శాంతి కరువయ్యింది. ఇంటి చుట్టూ ఎర్రని వస్త్రం కట్టారు. బంధువులు, స్నేహితులలెవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. కనీసం బ్యాంకు పనులు కూడా చేసుకోనివ్వడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు అనుమతిని ఇచ్చారని, కానీ పోలీసుల మధ్య గౌతమ్‌ను ఒంటరిగా వదిలి వెళ్లేందుకు భయంగా ఉందని సభా వ్యాఖ్యానించారు. అరెస్టులు, గృహ నిర్బంధం.. ఇదంతా కేవలం విచారణలో భాగమని.. ఇవి వారికి(పౌర హక్కుల నేతలు) ఎటువంటి చేటు చేయలేవని ఆమె పేర్కొన్నారు.

చదవండి : ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!

>
మరిన్ని వార్తలు