కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్‌

1 Nov, 2019 05:08 IST|Sakshi
ప్రమాణ æస్వీకారం చేస్తున్న ముర్ము, మాథుర్‌

లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా ప్రమాణ స్వీకారం

శ్రీనగర్‌/లెహ్‌: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం స్థానంలో నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా జీసీ ముర్ము, లేహ్‌కు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఆర్‌కే మాథుర్‌ గురువారం పాలనాపగ్గాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5వ తేదీన కేంద్ర తీసుకున్న నిర్ణయం అక్టోబర్‌ 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం తెల్సిందే. లదాఖ్‌ రాజధాని లెహ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్‌కే మాథుర్‌తో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్‌ గీతా మిట్టల్‌ శ్రీనగర్‌ వెళ్లారు. అక్కడ రాజ్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జీసీ ముర్ము(59)తో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధాకృష్ణ మాథుర్‌(66) 1977 బ్యాచ్‌ త్రిపుర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా, సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ముర్ము స్వస్థలం ఒడిశా. విధుల్లో ఉండగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి అధికారి ముర్మునే. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం కేంద్ర విధించిన ఆంక్షలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు