జీడీపీ వృద్ధి సందేహాస్పదం: విపక్షాలు

2 Mar, 2017 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) రేటు 2016–17కు  7.1 శాతంగా ఉంటుందన్న ప్రభుత్వ అంచనాలు అత్యంత సందేహాస్పదంగా, ప్రశ్నార్థకంగా ఉన్నాయని కాంగ్రెస్‌ విమర్శించింది. రేటును అతిగా చూపుతున్నారని సీపీఎం, సీపీఐ ఆరోపించాయి. ‘అంచనాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.. అంతర్జాతీయంగా దేశ విశ్వసనీయత దెబ్బతినే అవకాశముంది. ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి ఆనందర్‌ శర్మ మండిపడ్డారు.

నోట్ల రద్దు అనేది లేకపోయుంటే మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 25 శాతం ఉండేదా? అని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. అభివృద్ధికి అసలు కొలమానం మానవాభివృద్ధి సూచీ అని, ప్రభుత్వ లెక్కలు అతిగా ఉన్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. అయితే గణాంకాలను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలు సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాలు 7 శాతం జీడీపీతో తొలగిపోయాయని జైట్లీ అన్నారు.

మరిన్ని వార్తలు