ముఖ్యమంత్రే ఆమె పెళ్లి పెద్ద!

9 Jul, 2017 10:53 IST|Sakshi
ముఖ్యమంత్రే ఆమె పెళ్లి పెద్ద!

భోపాల్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2015 అక్టోబర్‌లో పాకిస్తాన్ నుంచి స్వదేశం తిరిగొచ్చిన గీత అనే యువతి వివాహాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘనంగా నిర్వహించనున్నారు. సీఎం శివరాజ్ స్వయంగా ఆమెకు సంబంధం చూసి కన్యాదానం చేయున్నట్లు విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం తెలిపారు. విదిశ ఎంపీ అయిన సుష్మా భోపాల్ వెళ్లినప్పుడు తరచుగా గీతను కలిసేవారు. ఈ క్రమంలో ఆమె వివాహ విషయాన్ని ఆమెతో ప్రస్తావించేవారు. గత బుధవారం గీతను సుష్మా మరోసారి కలిసి ఆమె పెళ్లి విషయాలు సీఎం శివరాజ్ చూసుకుంటారని హామీఇచ్చారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శనివారం భోపాల్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ ఆయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్ధతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సుష్మా స్వరాజ్, గీతను తీసుకెళ్లారు. కోవింద్, సీఎం శివరాజ్‌లు గీత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇండోర్‌లో గీత భాగోగులు చేస్తున్న అకాడమీ వారు బీజేపీ నేతలతో గీత(25) పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. సీఎం శివరాజ్ గీతకు సంబంధం చూసి కన్యాదానం చేస్తారని సుష్మాస్వరాజ్ చెప్పారు. మరోవైపు గీత మాట్లాడుతూ.. మరోసారి తాను పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తేలేదని అన్నారు. 'నేను భారతీయురాలిని. మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టాను. అందుకే భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నానని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం గీత హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకుంటోందని ఇండోర్ అకాడమీ అధ్యక్షుడు మురళీధర్ థమణి తెలిపారు.

పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్థాన్ చేరుకుంది. లాహార్ రైల్వేస్టేషన్లో పాక్ రేంజర్లు ఆమెను గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్లు పాక్‌లోని ఈధీ ఫౌండేషన్‌ ఆమె బాధ్యతలు చూసుకుంది. సుష్మాస్వరాజ్ జోక్యంతో ఎట్టకేలకు 2015 అక్టోబర్ 26న గీత భారత్‌కు చేరుకుంది. అప్పటినుంచి గీత తల్లిదండ్రుల కోసం అధికారులు తీవ్రంగా యత్నిస్తున్న ప్రయోజం లేకపోయింది. ఆమె పెళ్లి బాధ్యతలను సీఎం శివరాజ్ చౌహాన్ స్వీకరించారు.

మరిన్ని వార్తలు