సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష!

12 Jan, 2018 14:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రాను నియమించాల్సిందిగా సుప్రీం కోర్టు కొలీజియం గురువారం నాడు సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇలా సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ మహిళను నేరుగా అదే కోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. పురుషులైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించిన సందర్భాలు గతంలో ఉన్నాయిగానీ ఓ మహిళా న్యాయవాదిని నియమించడం ఇదే తొలి అవుతుంది. హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసిన మహిళా న్యాయవాదులే సుప్రీం కోర్టుకు న్యాయవాదులుగా పదోన్నతులై వచ్చారు తప్ప నేరుగా రాలేదు.

దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సాక్షాత్తు సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాతినిధ్యం లేదంటే ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్షత కొనసాగుతోందని అర్థం అవుతోంది. సుప్రీం కోర్టు పాలనా వ్యవహారాలు కూడా సవ్యంగా లేవన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం జస్టిస్‌ చలమేశ్వర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో సహా నలుగురు జస్టిస్‌లు వెలుగులోకి తెచ్చారు. సుప్రీం కోర్టు రుజువర్తన నేడు ప్రశ్నార్థకమైందని, సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోతే వ్యవస్థ మరింత భ్రష్టుపట్టి పోతుందని కూడా వారు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాను హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదట. ఈ వ్యవస్థ తీరుతెన్నుల గురించి మరిన్ని దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇందూ మల్హోత్రా నియామక సిఫార్సును ఆమోదించినట్లయితే ఆమె సుప్రీం కోర్టుకు  ఏడవ మహిళా న్యాయమూర్తి అవుతారు. మొత్తం సుప్రీం కోర్టులోని  27మంది జడ్జీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న రెండవ మహిళా న్యాయమూర్తి అవుతారు. ఆమెతోపాటు జస్టిస్‌ భానుమతి ప్రస్తుతం సర్వీసులో ఉన్నారు. సుప్రీం కోర్టుకు 1989లో మొదటిసారి ఓ మహిళా న్యాయమూర్తి నియమితులుకాగా, రెండోసారి మరో మహిళా న్యాయమూర్తి 1994లో నియమితులయ్యారు. 1950 నుంచి ఇప్పటి వరకు (సిఫార్సు దశలోనే ఉన్న ఇందూ మల్హోత్రా, మరో న్యాయవాది జస్టిస్‌ జోసెఫ్‌లు కాకుండా) సుప్రీం కోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వారిలో ఆరుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మొత్తం నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం రెండు శాతం మాత్రమే.

హైకోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం చూసినట్లయితే ఇంతకంటే కాస్త బెటరే. ప్రతిష్టాకరమైన బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్‌ హైకోర్టుల్లో  న్యాయమూర్తుల నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం దాదాపు పది శాతం ఉంది. దిగువ స్థాయి కోర్టుల్లో మహిళల ప్రాతినిథ్యం 28 శాతం ఉంది. లా చదువుతున్న విద్యార్థుల్లో స్త్రీ, పురుషుల సంఖ్య దాదాపు సమంగానే ఉన్నా, న్యాయవాది వృత్తిలో పది శాతం మహిళలే కొనసాగుతున్నారు. ఫలితంగా వివాహేతర సంబంధాలు, ట్రిపుల్‌ తలాక్, భార్యలపై బలత్కారం లాంటి మహిళా సంబంధిత అంశాలపై మగవాళ్ల బెంచీలే తీర్పులు వెలువరిస్తున్నాయి. మగవాళ్లు తీర్పుల్లో లింగ వివక్ష చూపిస్తారనికాదు, మహిళల సమస్యల పట్ల వారికే ఎక్కువగా నమ్మకం ఉంటుందన్న అభిప్రాయం ఉంది కనుక. ఇక ముందు అత్యున్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు సుప్రీం కొలీజియం ఎంతో కృషి చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు