ఫిబ్రవరి 2న సాధారణ బడ్జెట్!

7 Oct, 2016 04:35 IST|Sakshi

వీలుంటే అంతకంటే ముందే..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను జనవరి మూడో వారంలో ఏర్పాటు చేసి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 2న లేదా అంతకుముందే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. సాధారణ బడ్జెట్‌ను ముందుగానే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం, సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ విలీనం వంటి ప్రభుత్వ నిర్ణయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఆర్ధిక శాఖ వివరించింది. గురువారం జరిగిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం సమావేశంలో బడ్జెట్ సంస్కరణల లక్ష్యాలు, సంస్కరణల ప్రక్రియలోని వివిధ అంశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా వివరించారని తెలుస్తోంది.
 
సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల కలిగే లాభ, నష్టాలపై స్ధాయీ సంఘం సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, జనవరి 30, ఫిబ్రవరి 2 మధ్యలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, మార్చి 31 నాటికల్లా ఆర్ధిక బిల్లును పార్లమెంటు ఆమోదించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 1, 2017 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేసేందుకు వీలుగా కేంద్రం బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు పార్లమెంట్ సమావేశాలకు విరామం ఇవ్వొచ్చని, తర్వాత సమావేశమైనప్పుడు బడ్జెట్‌పై చర్చించి మార్చి 31కల్లా ఆమోదించడానికి పార్లమెంట్‌కు సమయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు