సోలో లైఫే సో బెటరు

5 Nov, 2018 11:29 IST|Sakshi
సంసారంలో ఉండే సమస్యలు ఒంటరి జీవితంలో ఉండబోవని నేటి అమ్మాయిలు నమ్ముతున్నారు

సంతోషం ‘మిస్‌’ కాదు  

బ్రహ్మచర్యంపై నేటి యువతుల్లో ఆసక్తి  

దాంపత్య జీవితంలో సమస్యలపై విరక్తి  

ఐటీ సిటీలో పెరుగుతున్న ట్రెండ్‌  

నేటి రోజుల్లో చదువులు, వృత్తి ఉద్యోగాల్లో ప్రగతి కోసం శ్రమిస్తున్న మహిళలు ముప్ఫై ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి మాటెత్తడం లేదని తల్లిదండ్రులు వాపోతుంటారు. కొందరు వనితామణులు ఒకడుగు ముందుకేసి అసలు మాకు పెళ్లే వద్దు, ఈ జీవితమే సంతోషంగా ఉండగా, కొత్తగా సమస్యలు తెచ్చుకోవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు.  

కర్ణాటక, బొమ్మనహళ్లి:  బ్రహ్మచర్యం అనేది ఒకప్పుడు ప్రధానంగా పురుషులకే పరిమితమై ఉండేది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఇప్పుడు యువతుల్లో, మహిళల్లోనూ ఆ ధోరణులు కనిపిస్తున్నాయి. కళ్లెదుటే స్నేహితులు, బంధువుల వివాహాలు విచ్ఛిన్నం కావడం, ఇష్టపడి కట్టుకున్న పెనిమిటి వికృత చేష్టలు, వంటి చేదు పరిణామాలు యువతులను బ్రహ్మచర్యం వైపు మళ్లిస్తున్నాయి. ఐటీ సిటీలో ఇప్పుడు అనేక మంది యువతులు ఒంటరి జీవనం వైపే మొగ్గు చూపిస్తున్నారు. అదే తమకు సంతోషాన్నిస్తోందని వారు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నా, వారి స్వతంత్ర ఆలోచనలను కాదనే హక్కు ఎవరికీ ఉండదు. 

సమావేశాలు, చర్చాగోష్టులు  
మరో పక్క నగరంలో కొందరు ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న యువతులు అసంఘటితంగా అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ సమావేశమవడానికి వీలుగా మీటప్‌డాట్‌కామ్‌ అనే సైట్‌లో ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అయితే మరి కొన్ని గ్రూపులు ఎవరితోనూ సంబంధం లేకుండా తమంత తాముగా కలుస్తూ ఉంటాయి. మజ్లిస్‌ లీగల్‌ సెంటర్‌ అనే ఫెమినిస్టు గ్రూపు, హ్యాపీలీ అన్‌మారీడ్‌ అనే ఆన్‌లైన్‌ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆరు గురు మహిళల కథనాలతో ఈ ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ గ్రూపు కోసం పని చేస్తున్న మహిళా న్యాయవాదులు, నగరంలో అనేక మంది మహిళలు అయిష్టంగానే వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు.  

పెళ్లి ఎందుకని చెబుతుంటాం
తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు స్పందన మందకొడిగానే ఉండేదని, క్రమంగా అనేక మంది మహిళలు తమను సంప్రదించడం ప్రారంభించారని హ్యాపీలీ అన్‌మ్యారీడ్‌ ప్రాజెక్టు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఆడ్రీ డెల్లో తెలిపారు. పెళ్లికి ప్రతికూలంగా యువతులను ప్రోత్సహించడమే తమ ప్రచార ప్రధానోద్దేశమని చెప్పారు. ఈ ప్రచారాన్ని ఒక్క  బెంగళూరుకే పరిమితం చేయకుండా దేశమంతా విస్తతం చేయదలిచామని తెలిపారు.
అవివాహితగా ఉంటే సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాన్ని పోగొట్టడమే తమ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అవివాహితగా ఉంటూ కూడా సంతోషకరమైన జీవనాన్ని గడపవచ్చని తాము చెప్పదలు చుకున్నామని, దీనికి ఆలంబనగా దేశంలోని నలుమూలల్లో ఉంటున్న అవివాహితుల కథనాలను వారికి వినిపిస్తున్నామని వివరించారు. వారంతా జీవితంలో బాగా స్థిరపడిపోయారు, వారికెప్పుడూ బోర్‌ కొట్టలేదు, వారు ఒక్కరుగానే ఉండవచ్చు, కానీ ఒంటరివారు కారు అని ఆమె ముక్తాయింపు నిచ్చారు.   – ఆడ్రీ డెల్లో, ప్రాజెక్టు డైరెక్టర్‌  

ఓ రెండు ఉదాహరణలు చూస్తే..  
30 ఏళ్ల అలేఖ్య (మారుపేరు) మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడులను పక్కన పెట్టి, ఒంటరిగానే ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.  
నగరంలో ఓ ప్రముఖ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల రాగిణిది  (మారుపేరు) మరో అనుభవం. 22 ఏళ్లకే ఆమెకు పెళ్లయింది. ఇష్టం లేకున్నా పెద్దల ఒత్తిడి మేరకు పెళ్లికి సరేనంది. రెండు నెలలకే ఆ వివాహం విచ్ఛిన్నమైంది. ఇద్దరు దత్తత సంతతితో ఇప్పుడు సంతోష జీవనాన్ని గడుపుతున్నానని ఆమె తెలిపింది.

బ్రహ్మచారిణిలకూ క్లబ్బులు   
బెంగళూరులో 2016లో హ్యాపీ క్లబ్‌ పేరిట ఓ గ్రూపు ఏర్పడింది. ఇందులో 50 మంది దాకా సభ్యులున్నారు. అందరూ అవివాహితులే. 30 ఏళ్లు పైబడిన వారే. అయితే వారంతా తమ క్లబ్‌ ఉనికిని బహిర్గతం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా తెలసుకుని సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే, సభ్యత్వ గడువు ముగిసి పోయిందని సమాధానమిస్తారు. వీరంతా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చూస్తూ, ఒంటరి మహిళగా ఉంటే కలిగే సంతోషం, ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చాగోష్టులు నిర్వహిస్తూ ఉంటారు. తామంతా అవివాహితులుగానే ఉండి పోతామని వారంతా ప్రతిజ్ఞ చేయడం మరో విశేషం. దీనిని ఉల్లంఘించిన వారు సభ్యత్వం కోల్పోతారని ఆ క్లబ్బు వ్యవస్థాపకురాలు తెలిపారు. ఈ క్లబ్‌ సభ్యులు... ఇతరులను ప్రోత్సహించడానికా అన్నట్లు తమ సంతోష ఘడియలు, క్షణాల స్క్రీన్‌షాట్స్‌ను తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

మరిన్ని వార్తలు