మధుమేహ నిర్ధారణకు కొత్త మార్గం!

12 Jun, 2020 18:59 IST|Sakshi

జన్యువులు ఆధారంగా మధుమేహం నిర్దారణ

జన్యు శాస్త్రం సహాయంతో మధుమేహాన్ని నిర్దారించే కొత్త మార్గం ద్వారా భారతీయుల్లో మెరుగైన నిర్థారణ,చికిత్సకు మార్గం సుగమం చేస్తుందని నూతన పరిశోధనలు తేల్చాయి.

భారతదేశంలో మధుమేహపు తప్పు నిర్థారణ ఒక సమస్యగా మారింది. ప్రామాణిక పాశ్చాత్య పాఠ్యపుస్తకాల్లో ఉండే మధుమేహ లక్షణాలు భారతీయుల్లో భిన్నంగా ఉండడం ఈ తరహా సమస్యకు దారి తీస్తోంది. ఇటీవల కాలం వరకూ టైప్ -1 మధుమేహం పిల్లల్లో కౌమార దశలో కనిపిస్తుందని, అదే విధంగా టైప్ -2 మధుమేహం ఊబకాయం ఉన్నవారిలోనూ, ఎక్కువ వయసు గల వారిలోనూ అంటే సాధారణంగా 45 సంవత్సరాలు దాటిన వారిలో కనిపిస్తుందని నమ్మేవారు. 

ఏదేమైనా టైప్ 1 మధుమేహం పెద్దవారిలో కూడా కనిపిస్తుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే టైప్ -2 మధుమేహం యువకులు మరియు సన్నగా ఉన్న భారతీయుల్లో కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రకాల మధుమేహాలను వేరు చేయటం మరింత క్లిష్టంగా మారింది. టైప్ -1 మధుమేహం జీవితకాలం ఇన్సులిల్ ఇంజెక్షన్లు అవసరమయ్యే రెండు రకాల వేర్వేరు చికిత్సా విధానాలను అనుసరిస్తుంది. టైప్ -2 మధుమేహం తరచుగా ఆహారం లేదా మాత్రల చికిత్సతో నిర్వహించటం జరుగుతుంది. మధుమేహ రకాన్ని తప్పుగా వర్గీకరించడం ఉప-ప్రామాణిక మధుమేహ సంరక్షణ విషయంలో సమస్యలకు దారి తీయవచ్చు.

పూణేలోని కె.ఈ.ఎం. ఆసుపత్రి, సి.ఎస్.ఐ.ఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్, యు.కె.లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకుల మధ్య నిర్వహించిన ఒక నూతన ప్రచురణ, భారతీయుల్లో టైప్ -1 మధుమేహ నిర్ధారణలో జన్యువులు కీలకమైన విషయాలను, ప్రభావవంతగా చూపిస్తాయని తెలిపింది. టైప్ 1 మధుమేహం అభివృద్ధి చెందే అవకాశాన్ని పెంచే వివరణాత్మక జన్యు సమాచారాన్ని ఎక్సేటర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన జన్యు ప్రమాద స్కోరు పరిగణలోకి తీసుకుంది. ఆరోగ్య పరీక్షల సమయంలో ఎవరిలోనైనా టైప్ 1 మధుమేహం ఉందో లేదో నిర్ణయించటంలో ఈ స్కోరును ఉపయోగించవచ్చు.

ఇప్పటి వరకూ ఈ పరిశోధనలు యూరోపియన్ జనాభా మీద జరిగాయి. ఇప్పుడు సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించిన ఓ పత్రికలో, భారతీయుల్లో టైప్ 1 మధుమేహాన్ని గుర్తించటంలో యూరోపియన్ రిస్క్ స్కోర్ ప్రభావవంతంగా ఉంటుందా అనే విషయాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ బృందం భారతదేశంలోని పూణె నుంచి మధుమేహం ఉన్న వారిని అధ్యయనం చేసింది. టైప్ 1 మధుమేహం ఉన్న 262 మందిని, టైప్ 2 మధుమేహం ఉన్న 352 మందిని, మధుమేహం లేని 334 మంది ఆరోగ్య పరిస్థితులను ఈ బృందం విశ్లేషించింది. వీరంతా భారతీయు (ఇండో-యూరోపియన్) మూలాలకు చెందిన వారు. భారతీయ జనాభా నుంచి వచ్చిన ఫలితాలను వెల్ కమ్ ట్రస్ట్ కేస్స్ కంట్రోల్ కన్సార్టియం అధ్యనం నుంచి యూరోపియన్లతో పోల్చి పరిశోధించారు.

డయాబెటిస్ యు.కె, పూణెలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ మరియు భారతదేశంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) మద్ధతుతో ఈ పరిశోధన, భారతీయుల్లో సరైన రకమైన మధుమేహాన్ని గుర్తించటంలో ఈ పరీక్ష ప్రభావ వంతంగా ఉందని, ప్రస్తుత రూపంలో కూడా ఇది యూరోపియన్ డేటా మీద ఆధాపడి ఉంటుందని కనుగొన్నారు. ఈ రచయితలు జనాభా మధ్య జన్యుపరమైన తేడాలను గుర్తించారు. దీని ఆధారంగా భారతీయ జనాభా విషయంలో ఫలితాలను మరింత బాగా తెలుసుకునేందుకు పరీక్షలను మరింత మెరుగుపరచవచ్చు.

ఈ విషయం గురించి ఎక్సెటర్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రిచర్డ్ ఓరం తెలియజేస్తూ, సరైన మధుమేహం రకాన్ని నిర్ధారించడం వైద్యులకు చాలా కష్టమైన సవాలు అని, టైప్ 1 మధుమేహం ఏ వయసులోనైనా సంభవిస్తుందనే విషయం మనకు ఇప్పుడు తెలుసుకున్నామన్నారు. తక్కువ బీఎంఐ ఉన్న వారిలో టైప్ -2 మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నందున ఈ పని భారతదేశంలో మరింత కష్టమన్న ఆయన, తమ జన్యు రిస్క్ స్కోరు భారతీయులకు సమర్థవంతమైన సాధనమని తమకు తెలుసునన్నారు. డయాబెటిక్ కెటోయాసిడోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలను నివారించేందుకు, అదే విధంగా ఉత్తమ ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రజలకు అవసరమైన చికిత్సను పొందటంలో సహాయపడుతుందని వివరించారు.

పూణేలోని కె.ఈ.ఎం. హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ చిత్తరంజన్ యాజ్నిక్, డాక్టర్ ఓరమ్ చెప్పిన విషయాలతో అంగీకరించారు. భారతీయ యువతలో సైతం అంటువ్యాధిలా విస్తరిస్తున్న మధుమేహం, దాని దీర్ఘకాలిక జీవ, సామాజిక మరియు ఆర్థిక చిక్కులను నివారించేందుకు ఈ సమస్యను సరిగ్గా నిర్థారించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. కొత్త జన్యుసాధనం దీనికి బాగా ఉపకరిస్తుందని, భారతీయ శరీరంలో (సన్నని కొవ్వు కలిగిన భారతీయులు) అధిక కొవ్వు మరియు అల్ప కండర ద్రవ్యరాశి కారణంగా ఇన్సులిన్ తగ్గిన చర్యకు వ్యతిరేకంగా ప్యాంక్రియాటిక్ బి కణాల విఫలతను నిర్థారించటంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. మధుమేహ రోగుల శారీరక లక్షణాలు ప్రామాణిక అంశాల నుంచి భిన్నంగా ఉన్న భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధుమేహ రోగుల్లో ఈ పరీక్షను ఉపయోగించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారతీయ మరియు యూరోపియన్ జనాభాలో టైప్ 1 మధుమేహంతో సంబంధం ఉన్న తొమ్మిది జన్యు విభాగాలను (ఎస్.ఎన్.పి.లుగా పిలుస్తారు) రచయితలు కనుగొన్నారు. దీని ద్వారా భారతీయుల్లో టైప్ 1 మధుమేహం ఆగమనాన్ని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. సి.ఎస్.ఐ.ఆర్ -  సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి)లో అధ్యయనానికి నాయకత్వం వహించిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జీఆర్‌ చందన్ ఈ విషయం గురించి తెలియజేస్తూ, భారతీయ మరియు యూరోపియన్ రోగుల్లో వేర్వేరు ఎస్‌ఎన్‌పీలు అధికంగా ఉన్నాయని గమనించటం ఆసక్తికరంగా ఉందని, ఈ ఎస్‌ఎన్‌పీలతో పర్యావరణ కారకాలు సంకర్షణ చెందే అవకాశాన్ని ఇది బయటపెడుతుందని వివరించారు.

భారతదేశ జనాభా జన్యు వైవిధ్యాన్ని బట్టి, అధ్యయన ఫలితాలు దేశంలోని ఇతర సంతతి విషయాల్లో కూడా ధృవీకరించాల్సి ఉంది. సి.ఎస్.ఐ.ఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎం.బి) డైరక్టర్ డాక్టర్ రాకేశ్ కె.మిశ్రా ఈ విషయం గురించి వివరిస్తూ, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల టైప్ 1 మధుమేహం ఉన్న వారిలో 20 శాతం భారతదేశంలో ఉన్నందున, జన్యు పరీక్ష కిట్ లను అభివృద్ధి చేస్తున్నారని, టైప్ 1 మరియు టైప్ 2 మధుమేహాలను విశ్వసనీయంగా గుర్తించగలిగే ఈ కిట్ దేశానికి అత్యంత ప్రాధాన్యత కల అంశమని తెలిపారు.

మరిన్ని వార్తలు