విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు!

11 May, 2020 11:18 IST|Sakshi
ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యురిటీ సిబ్బంది

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్‌ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్‌కు వెళుతూ అతడు ఇక్కడ చిక్కుబడిపోయాడు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించి కొనసాగిస్తోంది. (కరోనా: ఇటలీలో ఇంత తక్కువ.. ఫస్ట్‌టైమ్‌!)

ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్‌ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటై​న్‌ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్‌ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు. జీబాట్‌ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్‌జెట్‌ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్యస్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు. అతడితో పాటు ఉన్న ఇద్దరు శ్రీలంక పౌరులు, మాల్దీవులు, పిలిప్పీన్స్‌కు చెందిన మరో ఇద్దరు పౌరుల గురించి  ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు విమానాశ్రయ అధికారులు సమాచారం అందించారు. ఆయా దేశాలు రాయబార కార్యాలయాల ద్వారా వారికి సౌకర్యాలు కల్పించి, వారిని క్వారంటైన్‌ చేశాయి. (ఫ్రెండ్‌తో కలిసి పట్టుబడ్డ నటి

జీబాట్‌ మాత్రం తన లగేజీతో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. దినపత్రికలు, మేగజీన్స్‌ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేకపోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిలీఫ్‌ విమానంలో అం​కారాకు పంపేందుకు ప్రయత్నించినా టర్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో  కుదరలేదని వెల్లడించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే వరకు జీబాట్‌ నిరీక్షించక తప్పదని స్పష్టం చేశారు. కాగా, జీబాట్‌తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులను సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు. (గుడ్‌న్యూస్‌: రేపట్నుంచి రైలు కూత)

మరిన్ని వార్తలు