ఇక్కడొద్దు...

15 Aug, 2014 04:23 IST|Sakshi
ఇక్కడొద్దు...

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  బీజాపుర జిల్లా ఆల్మట్టిలో వాయనం సమర్పించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గురువారం అక్కడ రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పక్కనే ఉన్న బాగలకోటె జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పుతున్నందుకు నిరసనగా రైతులందరూ ఆకు పచ్చ కండువాలను పైకి ఊపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో అక్కడ గుమికూడిన రైతులు చెరుకు మద్దతు ధరను రూ.2,500గా నిర్ణయించాలని కూడా డిమాండ్ చేశారు.

రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసులు కూడా అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులను అనునయించడానికి ప్రయత్నించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున, ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.
 
చెరుకు మద్దతు ధరను  ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే రైతు సంఘాల ప్రతినిధులు తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఆయన ఆల్మట్టి జలాశయంలో కృష్ణమ్మకు వాయనం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేపీఎస్‌సీ నియామకాల రద్దును సమర్థించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. నియామకాలకు సంబంధించి కేపీఎస్‌సీ సభ్యులు కొందరికి ముడుపులు అందాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేది లేదని తెలిపారు. రాష్ట్ర పరిధిలో దీనిపై అనుసరించాల్సిన విధి విధానాలు ఉన్నాయని, వాటిని పాటిస్తామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు