సై అంటే సై!

30 Jun, 2020 04:15 IST|Sakshi
సోమవారం లద్దాఖ్‌లోని లేహ్‌లో గాల్లో చక్కర్లు కొడుతున్న భారత వైమానిక దళం హెలికాప్టర్‌ 

చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు రంగంలోకి ఘాతక్‌ కమాండోలు

అత్యవసర పరిస్థితుల్లో 8 నిమిషాల్లో ప్రతిదాడి చేసేలా భారత వాయుసేన రెడీ

ఐఎన్‌ఎస్‌ రాణా, ఐఎన్‌ఎస్‌ కులిష్‌లతో నావికాదళం సిద్ధం 

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుపక్షాలు తమదైన రీతిలో పోటీకి సిద్ధమవుతున్నాయి. చైనా సరిహద్దు దళాలకు శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకులను రంగంలోకి దించగా.. దీనికి దీటుగా భారత్‌ తన ‘ఘాతక్‌’ కమాండోలను సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ చైనా కయ్యానికి కాలుదువ్వితే వేగంగా స్పందించేందుకు భారత వాయుసేనను అప్రమత్తం చేసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో 8 నిమిషాల్లోనే ప్రతిదాడులు చేసేలా వాయుసేన సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. సముద్రమార్గంలోనూ చైనా కదలికలపై నిఘా ఉంచేందుకు నావికాదళం అప్రమత్తమైంది. అమెరికా, జపాన్‌ వంటి మిత్రదేశాల సహకారం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. (చైనాతో తాడోపేడో.. గ్యాస్‌ సిలిండర్లు నిల్వ చేసుకోండి)

హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్, జపాన్‌లు రెండు రోజుల క్రితమే నావికా విన్యాసాలను పూర్తి చేయగా ఇందులో పాల్గొన్న ఐఎన్‌ఎస్‌ రాణా, ఐఎన్‌ఎస్‌ కులిష్, జపాన్‌ నౌకలు జేఎస్‌ కషిమా, జేఎస్‌ షిమయూకిలు చైనాపై ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. సరిహద్దుల వెంబడి ఉన్న మూడు వాయుసేన స్థావరాలతో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేం దుకు, యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూండగా ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించడం ద్వారా భారత్‌ సై అంటోంది. ఆకాశ్‌ క్షిపణులు శత్రువుల యుద్ధవిమానాలతోపాటు డ్రోన్లు సంధించే క్షిపణులను ధ్వంసం చేయగలవు. సరిహద్దుల్లోని మూడు వాయుసేన స్థావరాల్లో చైనా జే–11, జే–8 యుద్ధ విమానాలు, బాంబర్‌ విమానాలు, ఏవాక్స్‌ను మోహరించినట్లు సమాచారం. అయితే పర్వతసానువుల్లో యుద్ధానికి సంబంధించి భారత్‌కు ఉన్నంత అనుభవం చైనాకు లేదు. లద్దాఖ్‌ లాంటి ప్రాంతాల్లో యుద్ధమంటూ వస్తే సుఖోయ్, మిరాజ్, జాగ్వార్‌ వంటి భారత యుద్ధవిమానాలు చైనీయులపై ఆధిపత్యం చెలాయిస్తాయని అంచనా.

రాటుదేలిన ఘాతక్‌ కమాండోలు
సరిహద్దుల్లో చైనీయులను ఎదుర్కొనేందుకు భారత మిలిటరీ వర్గాలు రంగంలోకి దింపనున్న ఘాతక్‌ కమాండోలు కఠోరమైన శిక్షణతో రాటుదేలారు. కర్ణాటకలోని బెళగావిలో 43 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఒక్కో కమాండో తన భుజాలపై 35 కేజీల బరువులు మోస్తూ రోజుకు 40 కి.మీ.ల దూరం ఏకబిగిన పరుగెత్తాల్సి ఉంటుంది. యుద్ధం లేదా ఘర్షణలాంటి పరిస్థితులు వస్తే పెద్ద ఎత్తున ఆయుధాలతో శత్రుమూకల్లోకి చొరబడి మెరుపుదాడులు చేయడం ఘాతక్‌ కమాండోల ప్రత్యేకత. పదాతిదళంలో భాగమైన ఘాతక్‌ కమాండోలు ఒట్టి చేతులతో శత్రువును మట్టికరిపించేలా శిక్షణ పొందారు. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడం, కొండలను, గుట్టలను అతి సునాయాసంగా దాటగలగడం, శత్రు స్థావరాల్లో విధ్వంసం సృష్టించడం ఘాతక్‌ కమాండోల ప్రత్యేకత. బెళగావి శిక్షణ కేంద్రంలో కమాండోలకు ఇచ్చే శిక్షణ ప్రపంచంలోనే అత్యంత కఠినమైందిగా గుర్తింపు పొందింది. పాకిస్థాన్‌పై భారత్‌ చేసిన సర్జికల్‌ దాడుల్లో పాల్గొన్నది ఘాతక్‌ ప్లటూన్‌ కమాండోలే. (పథకం ప్రకారమే డ్రాగన్‌ దాడి!)

భారత్, చైనా  నేడు చర్చలు
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడమే లక్ష్యంగా భారత్, చైనాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య మంగళవారం మరో దఫా భేటీ జరగనుంది. వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరలో భారత్‌ వైపునున్న చిషుల్‌ సెక్టార్‌లో ఉదయం 10.30 గంటలకు వీరు చర్చలు ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సున్నితమైన ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణకు సంబంధించిన విధి విధానాలను వీరు ఖరారు చేస్తారని వెల్లడించాయి.

జూన్‌ 6, 22వ తేదీల్లో చైనా భూభాగంలోని మోల్డోలో జరిగిన సంభాషణల్లో రెండు దేశాలు పరస్పరం ఏకాభిప్రాయం ఆధారంగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అంగీకారానికి వచ్చాయి. దీనిని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై సైనికాధికారులు ఖరారు చేయనున్నారు. భారత బృందానికి 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్, చైనా తరఫున టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ నేతృత్వం వహిస్తారు. 15న రెండు దేశాల సైనికుల ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందడం తెల్సిందే.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు