ఆ తప్పే వెంటాడుతోందా?

18 Aug, 2018 02:05 IST|Sakshi
వరద ఉధృతి ధాటికి వంతెనను కూలదోసే స్థాయిలో ఉరకలెత్తుతున్న నదీప్రవాహం

దేవభూమి కేరళ వర్ష బీభత్సానికి చివురుటాకులా వణుకుతోంది. అసలు ఎందుకీ ప్రకృతి ప్రళయం ? 2011లో చేసిన ఒక తప్పిదమే ఇప్పుడు వెంటాడుతోందా ? ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, కొండ ప్రాంతాల్ని తొలిచేయడం వల్లే ఈ దుస్థితి ఎదురైందా? అనే అనుమానాలు తలెత్తడం సహేతుకమే.  

గాడ్గిల్‌ కమిటీ సిఫారసులు బేఖాతర్‌  
పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో ప్రతీ ఏడాది వర్షాలు ఎక్కువ. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ భారీ వర్షాలు మామూలే. వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి ముందస్తుగా సరైన చర్యలు చేపట్టకపోవడం, పర్యావరణవేత్తలు చేసిన సూచనల్ని, సలహాల్ని పెడచెవిన పెట్టడం వల్ల ఇప్పుడు అతివృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేరళ ముప్పు ముంగిట్లో ఉందని 2011లోనే గాడ్గిల్‌ కమిటీ హెచ్చరించింది. లక్షా 40 వేల విస్తీర్ణంలోని పశ్చిమ కనుమల్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనవని పేర్కొంటూ వాటిని మూడు జోన్లగా విభజించింది. ఈ జోన్లలో మైనింగ్‌ తవ్వకాలు, ఎడాపెడా నిర్మాణాలు చేపట్టవద్దంటూ సూచనలు చేసింది. అటవీ కార్యకలాపాలకు మాత్రమే ఈ జోన్లను వాడుకోవాలని సిఫారసు చేసింది. కానీ అప్పట్లో కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్‌ ప్రభుత్వం గాడ్గిల్‌ కమిటీ చేసిన సిఫారసుల్ని పెడచెవినపెట్టింది.  

యథేచ్ఛగా తవ్వకాలు..  
ఈ సీజన్‌లో కేరళలో అత్యధికమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం కొండచరియలు విరిగిపడటమే. ఇడుక్కి, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కొజికోడ్, మలాపురం వంటి జిల్లాల్లో కొండచరియలు తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికంగా నివాసం ఉండే వారి సహకారంతో కొండ ప్రాంతాలను ఎలా కాపాడుకోవచ్చో గాడ్గిల్‌ కమిటీ వివరించింది. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, కొండ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టింది.

కేరళ వ్యాప్తంగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న యూనిట్లు 1500కి పైగానే ఉన్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్లో తవ్వకాలు జరపడం వల్ల నేల అడుగు భాగంలో మట్టి కదిలిపోయి డొల్లగా మారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతాల్లో తవ్వకాలపై నిషేధం విధించాలంటూ 2011లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పర్యావరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ఈ విపత్తు మానవ తప్పిదమేనని అంటున్నారు.  

కొండలపై ఆకాశహర్మ్యాలు: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న సాకుతో కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా రిసార్టులు, రెస్టారెంట్ల నిర్మాణానికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అటవీ భూముల్ని ఆక్రమించి చెట్లను నరికేసి ఎడాపెడా భవంతులు నిర్మించారు. వాటర్‌ జోన్లలో కూడా చట్టవిరుద్ధంగా ఆకాశహర్మ్యాలు వెలిశాయి. దీంతో కొండప్రాంతాలు నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. పై నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమైంది.

అదే ఇప్పుడు కేరళకు వరద ముప్పును తెచ్చిపెట్టింది. రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిపోయి గేట్లను ఎత్తేయడం ఒక్కటే ఇప్పటి పరిస్థితికి కారణం కాదని, ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ స్టడీస్‌ మాజీ శాస్త్రవేత్త వి. థామస్‌ అన్నారు.  కేరళలో 44 నదులు ప్రవహిస్తున్నాయి. నదీ గర్భాన్ని తవ్వుతూ తీరాల వెంట గృహ నిర్మాణాలు చేపట్టడంతో జనవాసాలను వరద నీరు ముంచెత్తింది. 


  • 1924 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే ప్రథమం

  • కేవలం రెండున్నర నెలల్లోనే 37% అధిక వర్షపాతం నమోదు

  • ఇడుక్కిజిల్లాలో 83.5% అధిక వర్షపాతం

  • 27 డ్యామ్‌ల గేట్లను ఎత్తేశారు

  • 211 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయ్‌ 

  • మృతుల సంఖ్య 180 పై మాటే 

  • 20 వేల ఇళ్లు ధ్వంసం

  • 10 వేల కిలోమీటర్ల రహదారులు నాశనం

  • రూ.8,316 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా

  • వరదముప్పులో ఉన్న జిల్లాలు ః 13 

  • రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాలు ః 9

  • ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం మూసివేత

  • ఆసియాలో అతి పెద్ద డ్యామ్‌ ఇడుక్కి నుంచి గత మూడు నాలుగు రోజులుగా సెకండ్‌కి 10–15 లక్షల లీటర్ల నీరు విడుదల

  • సహాయ చర్యల్లో నిమగ్నమైన 18 బృందాలు, మరో 12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం
  • ఓనం పండుగ కోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధులు వరద సహాయానికి మళ్లింపు 
మరిన్ని వార్తలు