ఒకే గదిలో బసచేయడం తప్పు కాదు!

8 Dec, 2019 08:12 IST|Sakshi

హైకోర్టు ఉత్తర్వులు 

సాక్షి, చెన్నై: వివాహం కాని ఆడ, మగ వ్యక్తులు ఒకే గదిలో నివసించడం తప్పుకాదని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. కోయంబత్తూరు అవినాసి రోడ్డులోని ఒక హోటల్‌ గదిలో అవివాహితులైన ఓ మహిళ, పురుషుడు నివసిస్తూ వచ్చారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. ఈ హోటల్‌లో రెవెన్యూ అధికారులు, పోలీసులు తనిఖీలు జరపగా ఈ వ్యవహారం బయటపడింది. మద్యం బాటిళ్లు ఉన్నందున అది కూడా చట్ట వ్యతిరేకమేనని రెవెన్యూ తరఫున చర్యలు తీసుకున్నారు. సదరు హోటల్‌కు సీలు వేశారు. ఈ సంఘటన గత జూన్‌ 26న జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ హోటల్‌ యజమాని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఎంఎస్‌ రమేష్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా హోటల్‌కు సీలు వేశారని, వివాహం కాని మహిళ, పురుషుడు ఒక గదిలో ఉండడం తప్పు కాదని తెలిపారు.

వారుంటున్న గదిలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు నేరం ఆరోపించారని, ఈ మద్యం బాటిళ్లను హోటల్‌ యాజమాన్యం విక్రయించలేదని, తమకు తాముగా తెచ్చుకున్నట్లు తెలిసిందన్నారు. తమిళనాడు మద్యం చట్టం ప్రకారం ఒకరు తగినంత మద్యాన్ని ఉంచుకోవచ్చని, మద్యం బాటిళ్లు కలిగి ఉండడం తప్పుకాదన్నారు. అందుచేత హోటల్‌కు సీలు సరికాదన్నారు. అందుచేత ఈ ఉత్తర్వులు అందిన రెండు రోజుల్లో కలెక్టర్‌ మళ్లీ తెరిచేందుకు అనుమతినివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు